Tuesday, October 4, 2011

తెలుగు గజల్

విద్య వంట పట్టేదెలా ఓ గురువే లేకుంటే
పాట శ్రుతి కలిసేదెలా ఓ దరువే లేకుంటే

చుట్టూ చేరిన వాళ్ళకు స్వాంతన ఇచ్చేదే జీవితం
అగ్నిగుండమై పోదా భూమి తరువే లేకుంటే

పాడిపంటలు మెండుగా ఉంటే పల్లె మురిసేది
చేను చేతికి వచ్చేదెలా ఊర్లో చెరువే లేకుంటే

పుట్టిన గడ్డనే కనుమూయాలని జీవికి ఆరాటం
బస్తీలోకి వలస ఎందుకు అక్కడ కరువే లేకుంటే

ఆలుబిడ్డలు అటువైపు దీనార్ల వేట ఇటువైపు
పలుకరిస్తుందా పసిపాపైనా చేరువే లేకుంటే


పదవీ విరమణ తో మొదలవును పైసల కష్టాలు
ఫించన్ ఫైలు కదలదు కాస్త బరువే లేకుంటే

'ఉదయ'కాంతి వెదజల్లు దీనార్తుల మోహాల్లో
బ్రతికి ఉండటం ఏమి లాభం పరువే లేకుంటే

1 comment: