Friday, August 26, 2011

ముదితల మనసెరుగుట శక్యమా


నీ కటాక్షవీక్షణం నా పై ప్రసరించబోదా అనే గంపెడాశ తో
నీవు పోవు తెరువెయ్యదో కనుగొని కనులు కాయలు కాచినంతవరకు
నిరీక్షణా తపస్సు నిమగ్నుడినై, డస్సినన్, శ్రమంబయ్యెడినన్
విశ్రమింపక, ఉసూరనక వేవేల దినముల్ నిస్సారమై పోయినన్
నీ కొరకు ఎంతగా విలవిల లాడినన్ ఎంతటి పాషాణమతివో
కిమ్మనవు అలాగని కాదనవు, రమ్మనవు సరికదా పొమ్మనవు
యుక్తతరుణమాసన్నమవుట చేతనో, మధువు తలకెక్కుటచేతనో
నీ స్పందనారాహిత్యం నాలోని అహంభావంను ప్రజ్వలింపచేయుట చేతనో
నీ ప్రక్కనే నడయాడి పోతున్న నెరజాణ తో నెయ్యమున్ పొందకోరగా
తటిల్లతలా తటాలున నను గుంజి నీ గాడపరిష్వంగన్ బంధితువే
ముదితల మనసెరుగుట శక్యమా మాన్యులకైనన్, మౌడులకైనన్ ఈ జగతిన్

Friday, August 19, 2011


సంతసమ్మది మదీయ మదిని సదా
కలుగుతున్నది గదా జవరాలి స్నేహామ్రుతమున్
మనసారా గ్రోలినన్
స్వర్గమందురే ఈ భావావేశమునేమో
హతవిధీ!
మరునిమిషమునే
విస విస లాడుతూ నెపమేమోటో చెప్పక
చూపుతిప్పుకుపోయినా
విరహాగ్నితో నాడెందం క్రుంగి
చేష్టలుగ్గి నిస్తేజితం కావించునే
నరకమందురు ఈ సంకట స్థితినేమో..
ఎవరు సమ్మతించినన్ లేకున్నను
నిజం సుమ్ము
క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్
అదియున్ గాక
ఎంతటి వాడివయ్యినన్
కాంతమణికిన్ దాసుడవు పో
నీ పౌరుష, ప్రగల్భాలు మదిని దోచిన పడతుల్ ముందు కొరగావు నిక్కమే

Saturday, August 13, 2011

మరో జన్మ కావాలేమో


అరిషడ్వర్గాల్ని జయించి
జితేంద్రుడనై జీవితగమనం సాగించాలంటే
ఓ జన్మ సరిపోతుందా
తలలు బోడులైనా
తలపులు జవనాశ్వాలై పరుగెడుతుంటే
పొద్దస్తమానం వల్లేవేసే ఏ మత గ్రంథం
పెదవులపై నిలవడమే గాని
ఆచరణకు రానీకుండా అహం ఉరకలు వేయిస్తుంటే
ఇతరులు అస్థిత్వాల్ని, వ్యక్తిత్వాలని విడిచి
నే గీచిన పరిధిలో నిలవాలనే
నే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని
ఒప్పించాలని పరితపించే మొండితనం
ముదిమి నాపై స్వారీ చేస్తున్నా
నన్ను విడవకుంటే
నిజమే
నేను నేనులా నడవటం
నే అనుకునే మనిషి గా జీవించడం
నేర్చుకోవాలంటే
మరో జన్మ కావాలేమో
నా పొరుగువాడ్ని నాలా ప్రేమించే
మానవ కనీస గుణం నాలో నిలుపకోవాలంటే
ఈ జన్మంతా చాలదేమో
జన్మరాహిత్యం, కర్మరాహిత్యం పొందాలనే
నా పరితాపం
జనన,మరణ చక్రంలో నలగాల్సిందేమో
నే పఠించే శుష్క వేదాంతం
బూడిదలో పోసిన పన్నీరేమో

Thursday, August 4, 2011

రుణపడే ఉంటా


నా కైతే ఇపుడు
చాలా ప్రశాంతంగా ఉంది
ఏ అలజడులు
భావోద్వేగాలు
ఏ మాత్రం కుదిపేయడం లేదు
వంతెన క్రింద నిశ్శబ్దంగా సాగే నదిలా
జీవితం సాగిపోతూ ఉంది.
ఒకటి మాత్రం నిజం
ఆ క్షణం...
ఏ స్పందన లేకుండా
ఏం జరిగిందో
ఏమాత్రం అంచనా కి అందక
నన్ను కాదని నీ వెళ్ళిపోయాక
కాళ్ళ క్రింద భూమి నిలువునా
చీలిపోయిందనుకున్నా
భవిత అగోచరమై
విరహపు అగాధంలో మునిగిపోయా
నిద్రలేని రాత్రుల్లో తలచి తలచి వగచా
నాటి నా అమాయకత్వం చూసి
ఇప్పుడైతే నాపై నాకే జాలి పుడుతుంది
ఏ లాజిక్ కు చిక్కని
స్వార్థం నిన్ను ప్రలోభపెట్టిందో
కల్లాకపటంలేని ప్రేమ నీకు ఆశలు రేకెత్తించలేకపోయిందో
ఏమైతేనేం జీవితాంతం
నీకు రుణపడే ఉంటా
వలచినందుకు కాదు
విడిచినందుకు
నన్ను నేను తెలుసుకునేందుకు
ఓ చక్కని గుణపాఠం నేర్పినందుకు....