Friday, October 21, 2011

తెలుగు గజల్ ( 4)





ఓరకంటి తో ఆ చూపులెందుకు పరాయి వనిత నీ చెల్లే కదా
వెకిలి వెకిలిగా ఆ నవ్వులెందుకు నడిచి వచ్చే ఆ ఇంతి నీ తల్లే కదా

బ్రతికేందుకు ఏ మార్గం లేక చావడానికి తెగువ లేక
ఏ పక్కలోనో ప్రతి రేయి నలిగే ఆ వారకాంత సిరిమల్లే కదా

ఒక్క క్షణం దరిలేకపోతే భరించగలవా ఆ విరహం
వ్యక్తిత్వం సంపూర్ణమయ్యేది సహచరి నీ అర్ధాంగి వల్లే కదా

ప్రోత్సాహం ఎందుకు బాబు అడ్డుగా నీ అహం లేకుంటే చాలు
అసూయతో పలికే మాటలు ఆమని మనసులో ముల్లేకదా

ఆకాశంలో సగమని మాటే గాని అవనిలో ఎక్కడ అవకాశం
అర్థంచేసుకునే మనసే ఉంటే ప్రతీ క్షణం ప్రణయపు జల్లేకదా

'ఉదయ'పు పని ఒత్తిడి లో అపరకాళిక అవతారమే ఏ ఇంటైనా
రసరాజ్యంలో చేరిన వేళ రతీదేవీ పరవశాల తుళ్ళే కదా

No comments:

Post a Comment