Wednesday, August 29, 2012

విశ్వ ప్రేమ గానం


జడలు కట్టిన అహంకారం
నలుగురి మధ్య గోడలు కడుతుంటే

కుచించుకుపోతున్న నీ ప్రపంచం
నిన్ను ఒంటరిని చేస్తుంది

ఒక్కరొక్కరుగా నీ వాళ్ళనుకునేవాళ్ళు
మనసు చంపుకోలేక దూరమవుతుంటే

నీ గదిలో నీవు గొప్పగా భావించే హేతువందని
ఇనుపసంకెళ్ళు బందీను చేస్తాయి.

విను వీధిని చేధించిన నీ ధృష్టి
నీ గుమ్మాన్ని సైతం దాటలేక
సంకుచితమవుతుంది.

ఏకాంత జీవితం కాదది
బితుకు బితుకు మంటూ సాగే
ఓ ఒంటరి ప్రయాణం

ఆత్మ సంతృప్తి కాదది
నోరు మెదపలేక
నీ మూర్ఖత్వంతో వాదించలేక
నీ మనసు చేసుకునే ఆత్మవంచన

విశ్వజనీనమైన సర్వంతర్యామిని
సర్వత్రా దర్శించగలిగితే
అహం కర్పూరం లా కరిగి
ప్రతి జీవి లో పరమాత్మ దర్శనంలో లీనమవుతావు

నిన్ను నీవు అర్పించుకునే ఆ క్షణంలో
నేను అనే భావన శాశ్వతంగా అంతమై
అద్వితీయ సచ్చిదానందంలో ఓ భాగమవుతావు
విశ్వప్రేమ గానం లో తీయని రాగమవుతావు