Saturday, April 30, 2011

నారీ పాద దాస్యం

మరులు మైకమును కల్పించి
ఉన్మత్త భావోద్వేగంను కలిగించి
రసానుభూతిలో సర్వం మైమరపించే
అనన్య అనుపమాన యోగమో
ద్వైతమద్వైతమయ్యే తనువులున్మాద,ఉద్రేక
భావప్రేరితమయై చలించే, చంచలించే, తరించే భోగమో
లిప్త పాటైన వియోగమందిన కుదురుగా ఉండనీక
అస్తిత్వమున్. వ్యక్తిత్వమున్, హారతి కావించు రోగమో
దైవకార్యమని తరింతురో
పైశాచిక కృత్యమని ఈసడించుకుందురో
ఎవరికి వారు వారి వారి భాగ్యం బట్టి భ్రమలు బట్టి
ప్రవచనాలు పలుకుదురో గాక
సృష్టి కి ప్రతి సృష్టి చేయు ఈ రసవత్తర భావ ఝరుల బారి నుండి
నారీ పాద దాస్యం కలిగించు మాయజాలం నుండి
తప్పింపుకొన శక్యం కాదే మునులకైన మౌనుల కైన ఏ మగనికైనన్

నీ జ్ఞాపకాల పందిరిలో....

ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నా
ఒక్క క్షణం ఆగండి అని
ఆజ్ఞాపించి వెళ్ళేవు
నిజంగా నీవు మరలా వస్తావని
మలి సంధ్య మరలిపోయినంతవరకు
నీలాకాశం నిశ్శబ్దగీతాన్ని ఆలపించినంతవరకు
నిరాశకు చోటివ్వక
నిస్పృహకు చోటివ్వక
నిరంతర నిరీక్షణలో గడిపా
రానని నీకు తెలిసినపుదు
రావాలని
నాతో నడవాలని
జీవితం పంచుకోవాలని నీకు లేనపుడు
వస్తానని చెప్పి ఎందుకు వెళ్ళావో
ఇప్పటికీ అర్ధం కాదు
రాయివని, కసాయివని, అడియాశలు రేపావని
ఎన్నటికీ దూషించలేను
నాకు మాత్రం తెలియదా
ఏ భయం నిన్ను పలాయనవాదానికి ప్రేరేపించిందో
ఏ ఆశల వలయం నిన్ను అవకాశవాదిగా మార్చిందో
ఆత్మను నాలో విడిచి, మనసు నాతో మమేకం చేసీ
శరీరాన్ని ఏ సామికి సమర్పణ చేసి
జీవితపర్యంతం నిర్జీవిగా బతుకుతున్నావో
అనే పరివేధనలో గడుపుతున్నా
నీ జ్ఞాపకాల పందిరిలో అలమటిస్తూనే ఉన్నా
ఏ క్షణమైనా ఎదురుకావా అని
నిరీక్షిస్తునే ఉన్నా....