Wednesday, June 29, 2011

ప్రణయాగ్ని ,,,,,,,,, ప్రళయాగ్ని


వలచితినని,
సదా తలచెదనని
ఎదలో నిలెచెదనని
హోయగాలతో
సోయగాలతో
బంజరువలె మోడువారిన
సైకతమైదానమై బీడువారిన
మదీయ మానసమందు
ప్రేమకాసారాలు ప్రసరించి
ప్రణయకేదారాలు పరిఢవిల్లించి
విభ్రాంతుఢునై ఒకింత దిగ్భ్రాంతుడినై
వాస్తవమా లేక
ఉన్మాదమా లేక
ఊహా చిత్రమా అని
కనులు పరికించి
స్వీయనఖక్షతగాత్రుడినై
పరిశీలించి
ప్రణయసుధామాధుర్యమును మనసారా గ్రోలుటకు
సంసిధ్ధుడినికాగా
విద్యుల్లతలా క్షణకాలంలో
మాటైనను చెప్పక మాయమైతివే...
నినుమరచుట తెలియక మధుశాలనే
నిత్యశయనమందిరంగా చేసుకొని
సురాపానసేవనలో స్వస్థతను పొందగా
ఎంతటి జానవే ..
మత్తును తలకెక్కనీయవు..
కనులకు కునుకు కూడా రానీయవు
నరకప్రాయమైనదిగదా
ప్రేయసీ నీ రాకతో
నీ పోకతో
వలదు జవరాండ్రను నమ్ముట
అని నోరార పలికిన ప్రాజ్ఞుల మాట నిజమైనది సుమా
ప్రణయాగ్నిని మించిన ప్రళయాగ్ని కలదే...

Monday, June 20, 2011

నిర్దేశాలు

మగువుల యెడ పగల్ గాని తెగువుల్ గాని చూపకు
మూఢుల్ తో జతకూడకు గుమిగూడకు
పేడులతో పోట్లాడకు, పౌరుష పల్కులు మాట్లాడకు
మ్లేచ్చుల తుచ్చమైన ప్రశ్నలకు బదులివ్వకు
మదాంధంతో మొరిగే గ్రామసింహాలకు ఎదురెల్లకు
నీ జుట్టును చేజిక్కించుకోవాలనే మదాంధుల జట్టులో నిలవకు
నీ వాళ్ళను హేళనచేసే వాడి జిల తీర్చనదే వదలకు
కుహానా ఆదర్శవాదుల కారుకూతలకు కించిత్ చలించకు
ముసుగువీరుల లొసుగులు ఎండగట్టనిదే వీడకు
నీ వైరికి తోడుగా నిలిచే వారి తోక జాడించనిదే పట్టు సడలించకు
జానా బెత్తెడు మరగుజ్జులతో పోట్లాడకు, పిడికిలెత్తకు

Saturday, June 11, 2011

కుసంస్కారి


సంసారివా?
సంస్కారివా?
సమాజవనంలో తిరిగే మానవ శార్దూలానివా?
ఎదుటివానికి బాధకలిగించే
రాతలు రాయగల్గే సంస్క్రుతి ఏ బడిలో
నేర్చుకున్నావు?
విషం చిమ్మేమాటలు ఏ ఒడిలో
ఒరవడి దిద్దుకున్నావు?
తీవ్రవాదంతో ప్రజల ప్రాణాలను
గడ్డిపోచలుగా పీకిపారేసేవాడు నీకు దేశభక్తుడు
సేవాభావంతో ఆపన్నులను ఆదుకునే
అనన్యసామాన్యుడు నీకు మాయావి
స్వయంక్రుషితో జీవనసోపానాలు
అధిరోహించే జనహ్రుదయనేత నీకు అధికార పిపాసి
మదోన్మాదంతో నగ్నచిత్రాల్లో అన్య దేవతలను ఆవిష్కరించడం
నీ ద్రుష్టిలో కళారాధన
మేథావి అయితేనేమి, మహాపురుషుడయితేనేమి
పరమత సహనం లోపిస్తే గుడ్డిగా సమర్ధించాలా
డూడూ బసవన్నలా బుర్రలూపాలా?
మానసిక రుగ్మతలతో
ప్రేలే సంధిప్రేలాపనలతో
సమాజోద్ధరణ జరిగిపోతుందని
సమసమాజ స్థాపన జరిగిపోతుందనే
పిచ్చి కలలు కనకు
పుట్టిన గడ్డలో సమాధైన సిద్ధాంతాలను
గబ్బిలంలా పట్టుకు వ్రేలాడకు
సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నాం గాని
నీ కుహానా విలువల వలువలు ఊడ్చడం
మాకంత కష్టం కాదు.
బ్రుహన్నలతో పోరాటాలు మాకు అభీష్టం కాదు.

Thursday, June 2, 2011

నా ధ్యాస...... ప్రతి శ్వాస

రేపటి గురించి ఆశ లేదు
నిన్నటి గురించి ప్రయాస లేదు
నేటి గురించి
ఈ నాటి గురించే
నా ధ్యాస...... ప్రతి శ్వాస

మళ్ళి వస్తానని వీడ్కోలు చెబుతున్న
ప్రేయసి ప్రేమ గా నా చేతిని చుంబించేటపుడు
వచ్చేవరకు ఎలా బతకాలనే బెంగతోనో
నేటి వరకు ఎలా గడపామనే చింతలతోనో
చెంతనున్న చెలి చుంబనాన్ని చేజార్చుకోనా

రేపటి గురించి ఆశ లేదు
నిన్నటి గురించి ప్రయాస లేదు
నేటి గురించి
ఈ నాటి గురించే
నా ధ్యాస...... ప్రతి శ్వాస

చేతుల్లో చిద్విలాసంగా
చిందులేస్తున్న నా చిన్నారి మోముపై
తొలకరిస్తున్న ఆనందపు డోలికలు వీడి
రేపటి వాడి భవిత ఏమైపోతుందనే బెంగతోనో
కోల్పోయిన నా బాల్యపు చింతలతోనో
ముద్దులొలికే చిన్నారి మురిపాలు వదులుకోనా

రేపటి గురించి ఆశ లేదు
నిన్నటి గురించి ప్రయాస లేదు
నేటి గురించి
ఈ నాటి గురించే
ఈ క్షణం గురించే
పరవశించాలనే
పరిమళించాలనే
నా ధ్యాస...... ప్రతి శ్వాస