Wednesday, December 17, 2014

మగతనానికే మూలవిరాట్టు

ప్రొద్దున్నే పెద్ద పని ఉన్నట్టు లేస్తారు 
అద్దం ముందు నిలబడి ఆవలిస్తారు
ఒక సారి మనస్పూర్తిగా అభినందించుకోవచ్చుగా 
ఆత్మీయంగా ఆ ప్రతిబింబాన్ని పలకరించుకోవచ్చుగా 
మనల్ని మనమే ప్రేమించుకోక పొతే 
మన జీవితం మనకే నచ్చక పొతే
వీడి తోనో వాడి తోనో పోల్చుకుంటూ
అయితే నెత్తిన రెండు కొమ్ములు తగిలించుకొనో
ఆత్మ న్యూన్యత పెంచుకొని నలిగిపోతో
ఎందుకొచ్చిన బ్రతుకు చెప్పు
కట్టుకున్న ఇల్లాలు నచ్చదు
కడుపున పుట్టిన సంతానం నచ్చదు
ఇరుగు వారు నచ్చరు పొరుగు వారు నచ్చరు
పని చేసే యజమాని మీదే చేతకాని సెటైర్లు
తోటి వారి లోపాలపై విమర్శల విసుర్లు
అనుక్షణం అసహనం తో రగిలిపోతూ
అనుదినం అనుమానాలతో క్రుంగిపోతూ
నీ ఆయుష్షు కి నీవే మంగళం పాడుతూ
నీ అనారోగ్యానికి నీవే స్వాగతం పలుకుతూ
కుదురుగా కూర్చొని ఒక్కసారి ఆలోచించు
లోపం ఎక్కడ తగలు పడిందో మనసారా పరికించు
నీకు నువ్వు నచ్చకపోవడమే
సకల దరిద్రాలకి మూలం
నీ బలాల మూలాలు శోదించక పోవడమే
అన్ని అనర్థాలకి అసలు కారణం
ఆత్మ ఔన్నత్వమే ఆత్మ విశ్వాసానికి నాంది
ఆత్మాభిమానమే ఆనందాలకు అసలు పునాది
నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావా
సహధర్మచారిణే సద్గుణాల సమాహారంగా కనుబడుతుంది
సంతానమే ప్రేమానందాలకు ఆలంబమై నిలుస్తుంది
నిన్ను నీవు మార్చుకొని చూడు
నీవు ఆశించే మార్పు
అణువణువునా అన్ని చోట్లా కనబడుతుంది
మానవత్వం నిలువెల్లా పరిమళించి
మగతనానికే మూలవిరాట్టు గా నిలుపుతుంది

ఆశ శ్వాసగా


నిశెరాత్రి శశి బింబాన్ని ఎవరైనా చూడొచ్చు 

అర్థరాత్రి అరుణోదయాన్ని తిలకించారా

వసంతకాలాగమనం తో వికసించిన కుసుమాలని 


తనువు పులకించేలా విరిసిన పారిజాతాల్ని పరికించి ఉంటారు 


శిశిరంలో విరబూసిన విరుల సమాహారాలని సృజించారా 


జన సమూహంలో పలకరింపుల ప్రతిధ్వనులలో


పెల్లుబుకుతున్న ఆత్మీయతా రాగాల్ని విని ఉండొచ్చు

ఏకాంత జీవనంలో నిశ్శబ్దం నిండిన స్తబ్ధత లొ 


అనురాగాల నిస్వన యుగళ గీతికల్ని విన్నారా 


ఆరిన చితి బూదిలోంచి ఓ నూతన సృష్టి 


మంగళవాక్యం పలికిన కథలకు మరో మలుపు 


చిరిగిన చరిత్ర పుటల్లోంచి మరో భవితకు నాంది


ఆశ శ్వాసగా బ్రతికేవారికి ముగింపులుండవు


ప్రతీ అడుగు పురుడు పోసుకునే మరో నూతన జీవనమే.

Saturday, November 8, 2014

TRUE LOVE Lasts forever...


ఇదిగో
ఇప్పుడే వస్తా 
ఇక్కడే ఉండండి అన్నావు.
ఎదురుచూడమన్నావు 
నిలుచునే ఉన్నా 
ఘడియలు గంటలయ్యాయి 
గంటలు రోజులయ్యాయి
రోజూలు  వారాలు కాదు నెలలయ్యాయి 
నెలలు కాస్తా సంవత్సరాలు 
సంవత్సరాలు కాస్తా  దశాబ్దాలు 
ఎలా గడిచాయంటే ఎలా చెప్పను..
ఇక నీవు రావని 
రాలేనని చెప్పలేక 
మొహం నాకు చూపలేక 
మోహం చంపుకోలేక 
నీ దారి నీవు చూసుకున్నావని 
నన్ను అలా  వదిలి పోయావని
తెలుసుకోడానికి 
తేరుకోడానికి 
చాలా సమయమే పట్టింది 
నిన్ను ద్వేషించే శక్తి లేక 
దూషించే  ఆసక్తి  లేక 
మరచిపోవడం తప్పదని  
కాలం ఒక్కటే దానికి మందు అని 
మౌనాన్ని ఆశ్రయించాను 
అంత తేలికా చెలి నిన్ను మరచిపోవడం 
నీవు నాకు ఆశవు కాదు 
నా జీవన శ్వాసవు 
రెండు సంవత్సరాలు పరిచయం కాదు నీవు 
రెండు మనస్సుల ప్రణయం 
జీవితాంతం నడవాల్సిన ప్రయాణం నీవు 
నన్ను కాదని వెళ్ళాక 
నా దారి నేను చూసుకోడానికి 
జీవన సమరంలో నిమగ్నమవడానికి 
ఎన్ని నిశ్శబ్ద యుద్ధాలు చేసానో 
పరిణయం ప్రణయానికి ప్రమాణం కాదని 
ఈ జీవన మజిలి లొ 
ఎక్కడో    ఎప్పుడో కలుస్తావని.......... 
ఓ బాధ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు 
ఒక నిరాశ నిన్ను ఒంటరిదాన్ని చేసినప్పుడు 
నీ మనసు ఏకాకి లా కకావికలమైనప్పుడు 
నా జ్ఞాపకం నీకు ఓదార్పు  నిస్తుందని 
నా మాటలు నీకు తోడై నిడై  ఉంటాయని 
ఏ నిశిరాత్రి  కలత నిదురలో 
ఉలిక్కిపడి లేచినప్పుడు 
నా తలపులు నీకు నిర్భీతిని కలిగిస్తాయని 
ఎన్ని సార్లు తలచానో 
ఎక్కడ నీవున్నావో 
ఏం  చేస్తున్నావని 
ఎక్కడెక్కడని వెతికానో 
ఫలితమివ్వని ప్రయాసలెన్ని పడ్డానో 
దుర్భిణి పెట్టి వెతికినా 
గూగుల్ లొ శోధించినా 
నీ పేరున్న వారెందరు దొరికారో  నీవు తప్ప 
నిరాశకు చోటివ్వక 
నిత్యం ఏదో ఒక క్షణమ్ నిన్ను మననం చేస్తూ 
ఏదో ఒక  రోజున  నా ముందుర నిలుస్తావని 
నిండైన,నిఖార్సైన, సత్యమైన ప్రేమకు 
మరణం అనేది  ఉండదని 
కాలం మన మనసుల్ని విడదీయలేదని
ఇరిగిపోని గంధంలాంటి మన బంధం  
నిత్య వసంత గీతం లా పచ్చగా ఉంటుందని 
విశ్వాసం తోనే ఉన్నా 
ఊపిరిలో నూతన ఉత్తేజాన్ని నింపుకుంటూనే  ఉన్నా ..........