Monday, May 28, 2012

ఆ బంధం ఎలా మరవగలవు




నిన్ను నిన్ను గా వలచేవాడు  .....  ఆ   బంధం  ఎలా మరవగలవు
నిన్ను తనుగా  కొలిచేవాడు  .  .....  ఆ   బంధం  ఎలా మరవగలవు                                                                                                    ॥నిన్ను॥

'ఏమండి' తో శ్రీకారం చుట్టి,   ఒరేగా పరివర్తన చెంది అడుగడుగున నీతో నడిచిన ..... .. ఆ   బంధం  ఎలా మరవగలవు ॥నిన్ను॥

నీ వ్యక్తిత్వానికి ఓ ప్రతిబింబంగా , జీవన తత్వానికి ఆలంబనగా
నిన్ను నిండుగా చెక్కిన శిల్పి...  ఆ   బంధం  ఎలా మరవగలవు ॥నిన్ను॥

ఓటమి  తో ఉసూరుమంటే, నిరాశతో  నీరసపడితే
నరనరాన ప్రేరణ నింపిన ....  ఆ   బంధం  ఎలా మరవగలవు      ॥నిన్ను॥

నీ  ఆలికి తోబుట్టువుగా, నీ బిడ్డకు చల్లని చెట్టుగా
ప్రతి భాధ్యతలో తానే నిల్చిన...ఆ   బంధం  ఎలా మరవగలవు ॥నిన్ను॥

నీ  ఇంటికి శంఖువు తానై, నీ భవితకు మూలం తానై
నీ విజయపు బావుటా  తానై... ఆ   బంధం  ఎలా మరవగలవు ॥నిన్ను॥

నీ  తప్పుల్ని నిలదీసే వాడు, ఋజుమార్గంలో నిలిపేవాడు
పదిమందిలో నీకై పోరాడేవాడు,  ఆ   బంధం  ఎలా మరవగలవు ॥నిన్ను॥

తుది  పయనాన్ని తన భుజాన మోసి, చితి ఆరేవరకు దుఃఖాన్ని ఆపి
కన్నీటితో భస్మాన్ని నింపిన ఓ హృదయమా, ఆ   బంధం ఎలామరవగలవు                                                                                            ॥నిన్ను॥
a


Saturday, May 26, 2012

పోతే ఏం మోసుకుపోతావ్

koodali.org, haaram, jalleda, telugu kavithalu,
  ..........పోతే ఏం మోసుకుపోతావ్  ........

పైసాకు పడి చస్తావ్ ....   పోతే ఏం మోసుకు పోతావ్
కాసులకు దాసోహమంటావ్.... పోతే ఏం మోసుకుపోతావ్    ॥పైసాకు॥


మా ఇంటికొస్తే ఏం తెస్తావ్.... మీ ఇంటికొస్తే ఏం పెడతావ్
నిత్యం స్వార్థ పురాణాలే ....  పోతే  ఏం మోసుకు పోతావ్   ॥పైసాకు॥


ఎంగిలి చేత్తో ఏనాడైనా ఓ కాకినైనా తరిమావా
పెంటను కూడా ఇంట్లో దాస్తావ్... పోతే  ఏం మోసుకు పోతావ్  ॥పైసాకు॥


కన్న పేగు  బంధమైనా పంచు కున్న రక్తమైనా
వ్యాపారమే నీ వ్యవహారం.....  పోతే ఏం మోసుకు పోతావ్  ॥ పైసాకు॥


ఎదుటివాళ్ళ మొహమాటం నీకు అంతులేని పెట్టుబడి
ఎవరేమనుకున్నా నీకేం ......  పోతే ఏం మోసుకుపోతావ్     ॥పైసాకు॥


జ్ణానోదయం కలిగేనా... జీవన సారం తెలిసేనా
నలుగురు ఎంతగా చీ కొడుతున్నా... పోతే ఏం మోసుకుపోతావ్  ॥పైసాకు॥

Friday, May 25, 2012

మరణమంటే.....

        
           మరణమంటే.....


శ్వాస గమనం ఆగడం         కాదు   మరణం
గుండె కదలిక  నిలవడం           కాదు మరణం    ॥ శ్వాస ॥


ఏ ఎండకు ఆ గొడుగు        ఎంత కాలమీ వేషాలు
నమ్మిన సిద్దాంతాలకు     నీళ్ళు వదలడమే  మరణం  ॥ శ్వాస ॥


గర్జించే సింహంలా       రొమ్ము విరుచుకు సాగాలి
పిరికితనంతో పేడివానిగా     మిగలడమే మరణం      ॥శ్వాస॥


వయసుమీరినాక పలికే      వైరాగ్యాలెందుకు భాయి
ఆశల  వలలో పడి          నీతి దిగజారడమే మరణం    ॥శ్వాస॥


విశ్వాసం కోల్పోయిన వాడి      ఉనికి   ఉండేదెక్కడ
ఇచ్చిన మాటను  గాలికి       వదిలెయ్యడమే  మరణం   ॥శ్వాస॥


ఉదయపు తొలి ఝాములోనే    మధుశాలకు పయనాలా
వ్యసనాలకు బానిసలై     విలువ కోల్పోవడమే మరణం  ।శ్వాస॥

Tuesday, May 22, 2012

శిఖరాన్ని నేను........

      
                                koodali.org, haaram,  శిఖరాన్ని నేను ( తెలుగు గజల్)

 జానా బెత్తెడు లెక్కలకు అందని   శిఖరాన్ని నేను
యువసైన్యాలను ఉరకలెత్తించే శంఖారావాన్ని నేను


అడ్డుగా ఓ గట్టు వేస్తే  ఇంకిపోయే చలమననుకున్నావా?
నింగిని నేలను ఒకటి చేసే  జల సునామీని నేను


ఉఫ్ మని ఊదేస్తే ఆరే దివ్వెననుకున్నావా?
భుగభుగమనే సెగలతో రగిలే జ్వాలాముఖిని నేను


విమర్శల ధాటికి వెనుతిరిగే భీరువుననుకున్నావా?
ఊరకుక్కల అరుపులకు చలించని ఐరావతాన్ని నేను


ఊపిరిపోతే  కనుమరగయ్యే స్మృతిననుకున్నావా?
ఆచంద్రతారార్కం  అందరి హృదిలో నిలిచే ఆదర్శం నేను


మాయామాటలతో మసిపూస్తే కనిపించని అద్దాననుకున్నావా?
చిమ్మ చీకట్లను చెల్లాచెదురుచేసే  'ఉదయ'కాంతిని నేను

Saturday, May 19, 2012

సంకెళ్ళను తెంచుకుపో

ప్రతిభావ్యుత్పత్తులు ఏ ఒక్కడి సొంతం కాదు
ఏ ఒక్కడికో సొంతమవ్వాల్సినవసరం అసలే అఖ్ఖర్లేదు
అసలు సిసలైన ప్రతిభ నీలో ఉంటే
ఏ గొట్టం గాడికో దాస్యం చెయ్యాల్సిన పని అసలే లేదు
ఎవడి నీడలోనో, ఎవడి ప్రాపకం కోసమో
దేబరించాల్సిన పని  అసలే అవసరం లేదు
పూర్వ జన సుకృతమో
నీవు పెరిగిన పరిస్థితుల ప్రభావమో
అహరహం నీవు  శ్రమించిన కఠోర పరిశ్రమల ఫలితమో
అన్యులకు  సాధ్యం కాని అనన్య సామాన్యమైన
అద్భుత ప్రతిభా పాటవాలు నీకు సిద్ధించినపుడు
వాటిని ఏ  అడ్రస్ లేని ఎవడి కృపాకటాక్షల ఫలితమని
ఆజన్మాంతం ఆ నీడలో ఎదగాలని
నీవు చిందించే చెమటనే కాకుండా
నీ  రక్తమాంసాలను, నీ అత్మాభిమానాన్ని
పొట్లాల్లో కట్టి టోకుగా అమ్మేస్తుంటే
బానిస సంకెళ్ళతో మగ్గిపోతూ
నిన్ను నీవు అమ్ముకోవలసిన పని లేదు
ఎదిరించనంతవరకే ఏ అధికారమైనా  నిలిచేది
ప్రశ్నించనంటవరకే ఎవరి దురహంకారమైనా నడిచేది
స్వేచ్చాగానాలతో నీ బ్రతుకును నీవి గడిపేందుకు
నీదైన భావాలతో నీ జీవితం జీవించేందుకు
అడ్డుగా నిలిచిన హరి హరాదులైనా అధిగమించి
నీ బ్రతుకుదారికో ముందుకు సాగిపో
నిఖార్సైన ప్రతిభకు నిదర్శనంగా నిలిచిపో
నీ జీవితగమనానికి చుక్కానివై కదిలిపో

Saturday, April 28, 2012

వృథా ప్రయాసలు

ఎందుకొచ్చిన వృథా ప్రయాసలు
ఎవరికి పనికొచ్చే ఆయాసాలు
ఒక పని చేస్తే దానికి ఒక ప్రయోజనం కాని
కలకాలం నిలిచే సార్థకత కాని
నలుగురికీ దశాదిశా నిర్దేశం చేసే ప్రాధాన్యత ఉండాలి
పట్టపగలు దివిటీలు వెలిగించి
నలుగురికీ తెలిసిన విషయాలను
దశదిశలా ఎరిగిన సత్యాలను
చరితార్థకం అయిన చర్వితచరణాలను
అద్దెకు బాకాలు తెచ్చి కాలయాపన చేసే
కుహానా ప్రకర్షలు, చౌకబారు చేష్టలు
కళ్ళముందు నిలిచే చంద్రతారార్కులను
కొత్తగా ఏం చూపిస్తావు సరికొత్తగా ఏం చెప్పగలుగుతావు
ఎడారిలో ఇసుక వ్యాపారం, గోదావరిలో మంచి నీళ్ళ అమ్మకం
ఎందుకొచ్చిన వ్యవహారం చెప్పు
వయసు మాలినవాళ్ళు చేసారంటే సర్లే అనుకోవచ్చు
జాలికాస్తచూపించి కాలక్షేపం కోసమని సర్దుబాటు చేసుకోవచ్చు
నీకేం పనిబట్టింది..ఇదేం తిమ్మిరొచ్చింది
ఉద్దండపిండానివి, నరనరానా వేడి నెత్తురు పారే
ఉష్ణకాసారానివి, జ్ణానభాండారానివి
నవ్యసేద్యంచేయగల, చేయించగల
నేర్పు, ఓర్పు గలిగిన చేయితిరిగిన సవ్యసాచివి
కళ్ళల్లో ఒత్తులు వేసుకొని
మార్గదర్శకం కోసం ఆశగా ఎదురుచూస్తున్న
యువకలాలకు స్పూర్తి అనే సిరాపొయ్యి
కించిత్ ప్రోత్సహాం కోసం కొట్టుమిట్టాడుతున్న
నవగళాలకు ప్రేరణ అనే ఇంధనం పొయ్యి
విగ్రహమూర్తుల ఊరేగింపులు మాని
సజీవ శిల్పాల రూపకల్పనలకు నీ ఉలినికాస్త పదునుచెయ్యి

Friday, April 27, 2012

ఇక్కడ ఉచిత సలహ చెప్పబడును

అయోమయం నిన్ను వెంటాడుతున్నప్పుడు
అడుగు ఎటు వేయాలో పాలుపోనపుడు
వచ్చే పరిణామాలు  నీ అంచనాకి అందనప్పుడు
చేధించాల్సిన సమస్య నిన్ను సతాయిస్తున్నప్పుడు
భవిత అగోచరమై  భయభ్రాంతుణ్ణి చేస్తున్నపుడు
నీ వాళ్ళనుకున్న ఓ నలుగురి సలహా తీసుకో
నీ కన్నా మేథావులు కాకపోవచ్చు
అనుభవంలో పెద్దగా ఆరితేరి ఉండకపోవచ్చు
కాని సమస్య తో వారు నీలా అంటిపెట్టుకోరు
నిశ్చలంగా ఆలోచనలను  సాగించగలరు కాబట్టి
ఏది ఉచితమో ఏది అనుచితమో కాస్త సూచించగలరు
సలహాలెవరైనా  ఇవ్వనీ ఎన్నైనా ఇవ్వనీ
నిర్ణయం తీసుకోవల్సింది మాత్రం నీవే
జరిగే ఫలితాలకు నిందించాల్సిందీ కూడా నిన్నే
ఎదుటివాడికేం పోయింది ఇలా ప్రయత్నించు అలా ప్రయత్నించు
నీ జీవితం తో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు
సలహా తీసుకోవాలి కదా అని కనబడే
ప్రతి ఎల్లయ్యకు, పుల్లయ్యకు నీ సమస్యలు
ఏకరువు పెట్టెయ్యకు, నీ తప్పుల చిట్టా విప్పెయ్యకు
భలేగా దొరికావని అసలు ఎప్పుడు దొరుకుతావని
గుంట వద్ద నక్కలా  కాసుకొని కూర్చొనే 
కుహానా స్నేహ బృందాలకు దొరికిపోతావు
ఎదుటివాడి అర్హత ఏమిటో అసలు తత్వమేమిటో
నీ పట్ల స్పందించే విధానమేమిటో 
నీవు చెప్పేటప్పుడు వాడి హావభావాలేమిటో
పరిష్కారం సూచించడానికి వాడి గతానుభవమేమిటో
గట్టు మీద మాటలేనా లేదా నీతో కలసి ఈదగలిగే
చొరవేమైనా ఉందా ఆసాంతం తెలుసుకో
ఆపాదమస్తకం పరిశీలించుకో
అసలు విజ్ణుల సలహా తీసుకోకపోవడం ఎంత తప్పో
చచ్చు సలహాలిచ్చే దద్దమ్మలని సలహా అడగడం అంతే తప్పు
ఈ జీవితం నీది ఈ సమస్య నీది
ప్రతీ పరాయివాడు ఒక ప్రేక్షకుడు మాత్రమేనని గుర్తించుకో
అదేపనిగా ఆనందిస్తాడో
ఆత్మీయతతో అనునయుస్తాడో 
అది వాడి వ్యక్తిత్వం మాత్రమే