Wednesday, May 25, 2011

నిరీక్షిస్తూనే ఉన్నా

కలో..... నిజమో ..
కేవలం భ్రమో... ఏమో కావచ్చు..
ఏ నలుగురు కనబడ్డా
అందంగా ఎవరు ఎదురైనా
నీవేనేమో.... ఏమో..
వీడి ఇన్నేళ్ళు అయినా
ఏ క్షణానైనా....
ఎప్పుడైనా
ఎక్కడైనా
కనబడకపోతావా
కనులారా ఓ సారి చూడకపోతానా
మనసారా ఓ సారి మురిపెంగా
పలకరించకపోతావా
ఎదురుచూస్తూనే ఉన్నా
ఆ రోజున నన్ను వీడిన ఘడియ నుండి
నిరంతరం నిరీక్షిస్తూనే ఉన్నా
ఒకవేళ అనుకోకుండా ఎదురైతే
చూపుతిప్పుకుంటావో
ఏమెరగనట్టుగా వెడలిపోతావో
మానిన గాయాలు రేపి పోతావో
నిజంగా ఓ సారి మరలా
కలవాలనే ఉంది
కనులారా చూడాలనే ఉంది..

Thursday, May 19, 2011

సాగరతీరాన....

నాకైతే నమ్మబుద్ధి కావటంలేదు
ఇక్కడే కదా కలసి మెలిసి తిరిగాం
చేతిలో చేయివేసుకుంటూ
తీరం చేరే అలలతో ఆటాడుకుంటూ
భుజం భుజం ఒరుసుకుంటుంటే
చల్లని గాలులు చేరువయ్యేందుకు
తమవంతు సాయం చేస్తూంటే
ముఖంపై పడే ముంగురుల్ని సుతిమెత్తగా
తొలగిస్తూ నీ అందాన్ని తనివితీరా చూసుకుంటూ
ఇక్కడే కదా రీపటి జీవితం అంటూ
అన్ని కథలు చెప్పుకుంది
బలంగా వీచే ఏ కెరటం చేరని తీరంలో
ఇసుకగూళ్ళు మురిపెంగా కట్టాం
జీవిత సునామీ చేరో తీరాన మిగిల్చినా
లేచిపడే ఆ అలల్లా నిత్యం నీ జ్నాపకాలు
నాలో చెలరేగుతునే ఉన్నా
అదేం విచిత్రమో నీవు చేసిన బాసలు
కనుమరుగైనాయెందుకో
అలల తాకిడికి మన అడుగు ముద్రలు
చెరిగిపోయినట్టే

Tuesday, May 3, 2011

ఉద్యమం......ప్రశ్నిస్తుంది ....

అరెరె భలే భలేగా దొరికింది మళ్ళీ మరో అవకాశం
మనమెంత పుణ్యాత్ములమో ప్రపంచానికి తెలియచేసి
మనలో ఉన్న బురదను సమాజం మీదకు,
ప్రభుత్వాల మీదకు
వెదజళ్ళి తెగ శునకానందం పొందేందుకు
అన్నా హజారే అందించిన అద్భుతావకాశం
చెయ్యాల్సిన ఉద్యోగం ఎనిమిది గంటలు తిన్నగా చెయ్యనోడు
మరదల మోజులో పెళ్ళాన్ని చంపి తాళి కట్టినోడు
సునామీ చందాల పేరిట జోలె నింపుకున్నోడు
తన ధర్మాన్ని ఆత్మసాక్షిగా ఒక్క క్షణం నిర్వర్తించనోడు
ఇలా చెప్పుకుపోతే నోటినిండా మాటలతో , మోసపు కృత్యాలతో
బతుకు సాగించే ప్రతీ ఓక్కడు
అవినీతి అంతం చేద్దామని
అన్నా హజారే కు జై అనేవాడే
ప్రభుత్వపు అవినీతి గురించి ఆయన మొదలు పెట్టిన ఉద్యమం
మనలోని సచ్చీలతని కూడా ప్రశ్నిస్తుంది
ఇకనైనా ముసుగులు తీసేసి మనస్సాక్షి ప్రకారం
మనోపంకిలాన్ని తొలగించి ,
గుండె పై చెయ్యేసి నిర్భీతిగా జీవించమని,
పాపం చెయ్యనోడే తొలి రాయిని విసరమన్న
ప్రభువు పలికిన మాట ను మదిలో నిలుపుకోమని

ఇకనైనా మారు

మనిషిని మనిషి గా గుర్తిస్తే కదా
మానవత్వం సార్ధకమయ్యేది
ఎదుటవాడిని గౌరవించడం చేతకాకపోతే
ఎదురుదెబ్బలు తప్పవు నాన్నా
ఎదుటవాడికి ఏమిస్తామో ఆదే
మనకూ దొరుకుతుంది
పరిస్థితులు మనకు అనుకూలంగా
ఉన్నాయని పంజా కనిపించే
ప్రతి ఒక్కరిపైనా జులిపించకు
నోటితో పలకరించి నొసటితో వెక్కిరించకు
ఇన్నాళ్ళూ గోప్యంగా దాచిన ముసుగు కాస్త
తొలిగిపోతుంది
సోయగాలు చిందిస్తున్న సైకత సౌధం
కళ్ళ ముందే కరిగిపోతుంది
నీ అద్దం నిన్ను చూసి జాలిపడకముందే
ఇకనైనా మేలుకో
ఎన్ని మనసులు గాయపడ్డాయో
ఈ క్షణమైనా తెలుసుకో