Monday, July 23, 2012

సరస్వతీ మాత భక్తుడే

 
మనిషన్నాక ఆ మాత్రం కళాపోషణ ఉండాలి
లేకపోతే గొడ్డుకి మనిషికి తేడా ఏంటని నటవిరాట్టు
నిక్కచ్చిగా కాదు నిర్భీతి గానే చెప్పాడు
భూమికి జానెడుంటే నేం    బారెడుంటే నేం
అసలు బుర్ర ఉంటే నేం లేకపోతే నేం
ఎవడి కళాపోషణ వాడి తుత్తికోసమో
జానెడు పొట్ట కోసమో
ఎవడి బాధలు వాడు పడతాడు
రంగుల సినిమాలు, బుల్లి తెరలు, అంతర్జాల మాయాజాలాలు వచ్చాక
నాటకాలు మొదలుకొని అన్ని కళలు వెల వెల బోతున్నాయి కదా
ఇక రచయితలంటావా     కొనే పాఠకులు కాదు కదా
కనీసం చదివే పాఠకులు అంతర్ధానమై
రాయాలనే కుతూహలాన్ని చంపుకోలేక
సాధారణ పాఠకులు కాదు కదా
సాహీతీ స్రష్టలమని చెప్పుకు తిరిగే
కుహానా సాహీతీ వేత్తల నుండి కూడా
గోరంత ప్రోత్సాహం లేక
తమ సాహితీ అభిలాషను
సైకతతీరాల్లో ఇంకే సెలయేరుల్లా
ఉనికిని కోల్పోతున్నారు
యవ్వనంలోనే వైధవ్యం పొందిన విధవల్లా
తమ కాంక్షల ఉధృతిని బలవంతంగా నిలుపుకుంటున్నారు
ఎవడో తెగించో, బరి తెగించో
నాలుగు డబ్బులు గుల గుల లాడటం వలనో
తీరని దుగ్ధని తీర్చుకోవాలని పరితపించో
నాలుగు పుస్తకాలు రాసి, స్వీయార్జనతో ప్రచురిస్తే
పెద్దమనసు చేసుకొని ప్రోత్సహించడం మాని
పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తావా
అటకమీద పెట్టుకుంటారో అంగడిలో పెట్టుకుంటారో
లేదా నీ చెల్లని సరుకుని ఎక్కడ తోసుకున్నావో
అక్కడే తోసుకుంటారో నీకెందుకు
సాహితీ సేద్యం చేసే ప్రతీ రచయిత
సరస్వతీ మాత భక్తుడే
ఆమె కృపాకటాక్షాలకు పాత్రుడే.....

(రచయితలందరినీ కట్టకట్టి ఓ ఆసామీ విమర్శిస్తే ఒళ్ళు మండి)
koodali.org, haaram. jalleda. telugu poem 

Monday, July 16, 2012

నీక్కొంచెం తిక్కుందా? లేదా?

 
మనిషన్నాక ఆ మాత్రం తిక్క ఉండాలి
అది తిక్కో కాదో దానికేటి లెక్కో అని
ఏ దిక్కుమాలినోడో తేల్చాల్సిన పని లేదు
ప్రతి అడ్డమాలిన గాడిద ఆడమన్నట్టు ఆడితే
ఎదురు ప్రశ్నించకుండా
డూడూ  బసవన్నలా బుర్ర ఊపితే
నిన్ను మించిన బుద్ధిమంతుడు లేడని
రాముడు మంచి బాలుడని ప్రమాణ పత్రాలు
ప్రశంసల పూల జల్లు పోటీ పడి మరీ ఇస్తారు
ఆర్ద్రతలేని, అనుభూతి లేని
కుహానా కబుర్ల మాయాజాలం కోసం
నీ ఉనికిని , నీ జీవన గమనాన్ని
నీకు నీవుగా రాసుకున్న రాజ్యాంగాన్ని
పదే పదే మార్చుకున్నావా
కుక్కలచింపిన విస్తరి లా మారుతుంది నీ వ్యక్తిత్వం
దారిన పోయిన ఏ దానయ్యో
నీ అస్తిత్వాన్ని, నీ జీవన ఔచిత్యాన్ని
లెక్కకట్టడానికి
అసలు వాడికున్న అర్హత ఏమిటో
వాడు ఉపయోగించే ప్రమాణాలేంటో
బలుపంటారో
పొగరంటారో
కొవ్వు తలకెక్కిందంటారో
నెత్తిన కొమ్ములు మొలచాయంటారో
అనని.   అలిసేలా వాగని
స్పందించాల్సిన పనేమీ లేదు భాయి
ఎదుటివాడితో మనం జీవించేది
కొద్ది క్షణాలో,  మహ కాకపోతే కొద్ది దినాలే
నిత్యం నీతో నిలిచేది
సదా జీవించేది నీకు నీవే
ఎవడి గురించో నీ విలువల వలువలు వదలకు
ఫలితమేమొచ్చినా    తరిచేందో    భరించేదో
నీకు నీవే మిత్రమా
అందుకే నీ తిక్క ఎవడి లెక్కకు అందకు పోయినా
నీ లెక్కల్లో నిలిచినంతవరకు హక్కుగా భావించు
జీవితంలో ప్రతి క్షణాన్ని రమించు......
koodali.org, pavan kalyan, power star, haaram, jalleda, teluguone.com 

Saturday, July 7, 2012

ఆరాటాలు- పోరాటాలు

 
ఎవరికీ ఎవరూ ఏమీ కారు
ఎవరు ఎప్పుడు అడుగు పెడతారో
ఎలా దూరం అవుతారో
ఎందుకు విడిపోతారో
అర్థం కూడా చేసుకోవలసిన అవసరం ఉండదు
అహం పెరిగిందనో
అవసరం తీరిందనో
అసూయ తలకెక్కిందనో
మనకే మనమే తీర్పులిచ్చేసుకుంటాం
మన మనుగడ మనకే
ప్రశ్నార్ధకమవుతుంటే
మన ఆలోచనలు మనకే
అంతుచిక్కకుండా ఉంటే
ఇతరుల ఆలోచనలకు
జీవిత గమనాలకు
భాష్యాలు  ఎలా చెప్పగలం?
కళ్ళకున్న పొరలు ఒక్కటి ఒక్కటిగా
విడగొట్టుకోగలిగితే
ఎదుటివారి నిస్సహాయతను
అర్థం చేసుకోగలిగితే
తమ ఉనికిని కొనసాగించడానికి
అంతర్గతంగా వాళ్ళు చేస్తున్న సంఘర్షణను
చూచాయగానైనా శోధించగలిగితే
అడ్డుగోడలు అదృశ్యమైపోతాయి
అక్కున చేర్చుకోలేకపోయినా పరవాలేదు
అపనిందనల అభిషేకాలు చేయాలనే
ఆలోచన కనుమరుగయితే చాలు
ఇక్కడ డార్విన్ చెప్పిన మనుగడకోసం పోరాటాలు కాదు
ఆధిపత్యం కోసం అభిజాత్యాలకోసం ఆరాటం కొనసాగుతుంది
ఈ పిల్లిమొగ్గల్ని, విధూషక వేషాల్ని
అర్థం చేసుకోగలిగితే
ఇక మనస్పర్థలుండవు.
అక్కున చేర్చుకోవాలనే ఆశ పుడుతుంది
  స్వాంతన చేకూర్చాలనే ఆలోచన రేగుతుంది.
మన మనసుల్లో మసిబారిన ద్వేషం తుడుచుకుపోతుంది
ప్రేమాభిమానాలు పెల్లుబుకి ,వెల్లువలై ముంచెత్తుతాయి.

Sunday, July 1, 2012

తెలుగు గజల్..

తెలుగు గజల్..

మత్తులో గమ్మతుగా ఊగాలని లేదు
తొత్తులా బానిసనై బతకాలని లేదు

కీర్తి కాంత కాంచనాలే జగతిని నడిపిస్తుంటే
ప్రతి బంధాన్ని పైసా తో కొలవాలని లేదు

అనుమతి నీవు ఇవ్వనిదే అజమాయిషీ నీపై సాధ్యమా
అధికారం ముందు ఆత్మగౌరవం అమ్మాలని లేదు

ఒడ్డుచేరినాక తెప్పతెగలేయడం షరా మామూలే
ఓనమాలని నేర్పిన గురువుని మరవాలని లేదు

అయిదు చుక్కల పూటకూళ్ళ సత్రాల ఆడంబరాలెన్నున్నా
అమ్మ చేతి గోరుముద్దతో  సరి పోల్చాలని లెదు

నీవొప్పుకోనిదే ఓటమి ఓటమి ఎలా అవుతుంది
పడిన చోటే బావురుమంటూ నిలవాలని లేదు
భూమి బంగారాలు కాదు , నా అన్నవాళ్ళే నీ అసలైన ఆస్తి
అహం తలకిక్కించుకొని అందరికి దూరం కావాలని లేదు

ఎందుకు ఉదయ్ ఈ తత్వాలు ఎవడు వినాలని
స్పందించక ఆగిన హృదయాలను వదిలేయాలని లేదు.
koodali.org, haaram, jalleda, telugu poems, motivational poetry