Sunday, February 10, 2013

తొలి సంతకం నీవు



ఎలా  చెప్పను  చెలి
హృదయపు తెల్ల కాగితం మీద
తొలి సంతకం నీవు

కాలం విడిచిన
అనుభవాల పొరల్లో
చెదరని జ్ఝాపకం నీవు

సర్దుబాటుతో
గడిపే సంఘటనలెన్నున్నా
గుండెను కుదిపె స్పందన నీవు

ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు
కలిసినా తడి ఆరని
వెచ్చని తొలిముద్దువు నీవు

వేదనలాంటి వేసవిలో
నిరాశా నిస్పృహలతో ఉంటే
చల్లగా సేద తీర్చే చిరుజల్లువు నీవు

మోడుబారినా, మసకబారినా
నిత్యం కొత్త వెలుగు ప్రసరించే
నిత్య ఉగాదివి నీవు

కంటికి నీవు దూరమైనా
చిరునామా ఏదో చెదిరిపోయినా
తెలియని ఆశతో నడిపించే ఇంధనం నీవు

Friday, February 1, 2013

మగతనమంటే

ఆడవారిని అర్థం చేసుకోలేనివాడు
అమ్మతనం చవి చూడనివాడే
అమ్మ లాలింపు పొందని వాడు
అతివల ఔదార్యాన్ని, ఔన్నత్వాన్ని
అర్థం చేసుకోలేడు అవగాహన పొందలేడు
మగతనం అంటే కర్కశంగా కాఠిన్యంగా
కరుణలేకుండా బండలాగ బ్రతకడం కాదు
బయట పరిస్థితులబట్టి ఎలా వ్యవహరించాల్సి వచ్చినా
లోన లోలోన అమ్మతత్వం అపురూపంగా దాచుకోవడమే
పూలని నలిపినట్టు, వాసన చూసి వెదజల్లినట్టు
వ్యవహరించడం మూర్ఖత్వం అమానుషత్వం
శతశాతం శౌర్యం నీలో ఉందంటే సుమబాలల సున్నితత్వం
ఆడవారి ఆత్మగౌరవం నిలపడం నీకు తెలుసన్నమాట
తండ్రితో ఉన్నప్పుడెంత గోముగా, ధైర్యంగా మరికొంచెం పెంకిగా
తల్లితో ఉన్నప్పుడు ఎంత విశ్వాసంగా, లాలనగా మరికొంచెం అతిచనువుగా
ప్రతి స్త్రీ ఉంటుందో ఆ భావనలన్నీ నీవు కల్పించగలిగావంటే
నీ ఆదరణలో , నీ ఆప్యాయతలో వాటిని మరువగలుగుతుందో
నూటికి నూరుపాళ్ళు నీవు మగవానిగా విజయం సాధించినట్టే
చెంతన నీవున్నావంటే గజ గజా వణకడం కాదు
ఎక్కడో పారవేసుకున్న పసితనం మరలా ఆమెలో ప్రవేశించాలి
ఆనందం చిందులు వేస్తూ, కబుర్లతో కాలహరణం కావించాలి
ప్రక్కన నీవున్నావంటే ప్రపంచాన్ని జయించినంత
పులకరింత నరనరానా నిండాలి నూతనోత్సాహం కలగాలి
కొత్త బంగారు లోకం కనులముందు నిలవాలి
కలకాలం సాగాలనే కోరికలతో నడవాలి
koodali, haaram, telugu poems.