Sunday, October 23, 2011

తెలుగు గజల్ ( 6 )




సుఖమైన దుఃఖమైన నలుగురితో పంచుకో
మమతాను రాగాలతో నీ వాళ్ళుగా పెంచుకో

కోరుకున్న నాడే కాస్త వివేకం ఉండాలి
కాయేదో పండేదో చూసి మరీ తుంచుకో

కడదాకా సాగాలనె తపన నీలో ఉంటే
పనికిరాని బంధాలను పురిటిలోనే తెంచుకో

వినేవాళ్ళు దొరికారని ఊదేయకు భారతం
బాధలేవో ఉంటే అవి నీలోనే ఉంచుకో

పనివాడు పందిరేస్తే పిచ్చుకేమో తోసిందట
పనిచేసే చోట నీ ఒళ్ళుకాస్త ఒంచుకో

'ఉదయా' న్నే పిజ్జా బర్గర్ లంటూ గడ్డితిని బ్రతకకూ
చద్దన్నం తో ఓ చల్ల మిరప నంచుకో

Friday, October 21, 2011

తెలుగు గజల్ ( 5 )




ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడని బోధించగలరా?
అణువణువునా పరమార్ధమున్నదని శోధించగలరా?

ఇంటిపేరు తో సహ ఇంటిని వదిలిన శ్రీ మహాలక్ష్మీ
కోడలిలో కూతుర్ని చూస్తే ఇలా వేధించగలరా?

లక్ష్యం అంటే జీవిత స్థితి గతులను మార్చాలి
మరగుజ్జు కాలి నడకలతో శిఖరం సాధించగలరా?

స్వార్థం విడిచి చూస్తే వేధన అందరికీ ఒకటే
పొరుగింటిలో పాడె లేస్తే ఇలా రోధించగలరా?

గులాంలై సలాం కోట్టేది స్వాభిమానం లేకుంటేనే
నమ్మిన సిద్ధాంతం కోసం నాయకునితో విభేధించగలరా?

సరిహద్దులు చెరిపేసి సైన్యాలకు సెలవిస్తేనే సామరస్యం
వసుధైక కుటుంబ భా'వోదయా'న్ని ఆమోదించగలరా?

తెలుగు గజల్ ( 4)





ఓరకంటి తో ఆ చూపులెందుకు పరాయి వనిత నీ చెల్లే కదా
వెకిలి వెకిలిగా ఆ నవ్వులెందుకు నడిచి వచ్చే ఆ ఇంతి నీ తల్లే కదా

బ్రతికేందుకు ఏ మార్గం లేక చావడానికి తెగువ లేక
ఏ పక్కలోనో ప్రతి రేయి నలిగే ఆ వారకాంత సిరిమల్లే కదా

ఒక్క క్షణం దరిలేకపోతే భరించగలవా ఆ విరహం
వ్యక్తిత్వం సంపూర్ణమయ్యేది సహచరి నీ అర్ధాంగి వల్లే కదా

ప్రోత్సాహం ఎందుకు బాబు అడ్డుగా నీ అహం లేకుంటే చాలు
అసూయతో పలికే మాటలు ఆమని మనసులో ముల్లేకదా

ఆకాశంలో సగమని మాటే గాని అవనిలో ఎక్కడ అవకాశం
అర్థంచేసుకునే మనసే ఉంటే ప్రతీ క్షణం ప్రణయపు జల్లేకదా

'ఉదయ'పు పని ఒత్తిడి లో అపరకాళిక అవతారమే ఏ ఇంటైనా
రసరాజ్యంలో చేరిన వేళ రతీదేవీ పరవశాల తుళ్ళే కదా

Sunday, October 16, 2011

తెలుగు గజల్ (2)

తెలుగు ఘజల్ (2)

ప్రేమ ఇంత మధురమని తెలిసింది నిన్ను నేడు కలిసాక
నిర్మలంగా ఉంది చూడు ఆకాశం వాన కాస్త వెలిసాక

అహం పొరలు కమ్మితే మంచేది మరి చెడ్డేది
మానవత్వం పరిమళించదా సోహం అంటే తెలిసాక

ఎవరెస్ట్ ఎక్కినా సరే దొరకని అపరిమితానందం ఎక్కడ
కన్నతల్లి కళ్ళల్లో కొడుకు ప్రయోజకుడయ్యాడనే మెరుపు మెరిసాక

కల్లబొల్లి కబుర్ల బాతాఖానీలకే కన్నె పిల్లలు కరుణించేది
కనబడరు బాబూ కంటికి కాస్త ఆ ముచ్చటేదో మురిసాక

పొద్దస్తమానం పనికిమాలిన రాతలతో ఎందుకీ ' ఉదయా'నందం
పరవశించదా మది రసజ్ణుల ప్రశంసల జల్లులో నిలువెల్లా తడిసాక

తెలుగు ఘజల్ (3 )

తెలుగు ఘజల్ ( 3 )

కలలో కూడా మరువని దైవం తల్లే కదా
స్వర్గాన్నైనా మరిపించే సౌఖ్యం ఇల్లే కదా

ప్రేమలో పడితే పిచ్చి తలకెక్కక మానుతుందా
కసిరే ప్రేయసి మాటలు సైతం పన్నీటి జల్లే కదా

నీతి లేని రాజనీతి రాజ్యమేలుతుంది నేడు
ఏ పూటకి ఏ పక్షమో ప్రతి ఒక్కడు గోడమీద పిల్లే కదా

రాశికి కాదు విలువ ఏ నాడైనా వాసికి మాత్రమే
పరువం గుభాలించే పరిమళమిచ్చేది సిరి మల్లే కదా

పోగొట్టుకుంటేనే తెలిసేది ప్రేమకున్న విలువ
నరకాన్నైనా తలపించేది విరహపు ముల్లే కదా

పోరగాళ్ళ పోకిరి కాస్త పరిధిలో ఉంటేనే అందం
కనిపించే కుర్రదాని కొంగులాగితే చెంప చెల్లే కదా

జ్ణానోదయం కలగక పోతే మనిషికేదీ సార్థక్యం
జాతి భవితను మార్చేది బడిలోని నల్ల బల్లే కదా

Tuesday, October 4, 2011

తెలుగు గజల్

విద్య వంట పట్టేదెలా ఓ గురువే లేకుంటే
పాట శ్రుతి కలిసేదెలా ఓ దరువే లేకుంటే

చుట్టూ చేరిన వాళ్ళకు స్వాంతన ఇచ్చేదే జీవితం
అగ్నిగుండమై పోదా భూమి తరువే లేకుంటే

పాడిపంటలు మెండుగా ఉంటే పల్లె మురిసేది
చేను చేతికి వచ్చేదెలా ఊర్లో చెరువే లేకుంటే

పుట్టిన గడ్డనే కనుమూయాలని జీవికి ఆరాటం
బస్తీలోకి వలస ఎందుకు అక్కడ కరువే లేకుంటే

ఆలుబిడ్డలు అటువైపు దీనార్ల వేట ఇటువైపు
పలుకరిస్తుందా పసిపాపైనా చేరువే లేకుంటే


పదవీ విరమణ తో మొదలవును పైసల కష్టాలు
ఫించన్ ఫైలు కదలదు కాస్త బరువే లేకుంటే

'ఉదయ'కాంతి వెదజల్లు దీనార్తుల మోహాల్లో
బ్రతికి ఉండటం ఏమి లాభం పరువే లేకుంటే