Sunday, October 16, 2011

తెలుగు ఘజల్ (3 )

తెలుగు ఘజల్ ( 3 )

కలలో కూడా మరువని దైవం తల్లే కదా
స్వర్గాన్నైనా మరిపించే సౌఖ్యం ఇల్లే కదా

ప్రేమలో పడితే పిచ్చి తలకెక్కక మానుతుందా
కసిరే ప్రేయసి మాటలు సైతం పన్నీటి జల్లే కదా

నీతి లేని రాజనీతి రాజ్యమేలుతుంది నేడు
ఏ పూటకి ఏ పక్షమో ప్రతి ఒక్కడు గోడమీద పిల్లే కదా

రాశికి కాదు విలువ ఏ నాడైనా వాసికి మాత్రమే
పరువం గుభాలించే పరిమళమిచ్చేది సిరి మల్లే కదా

పోగొట్టుకుంటేనే తెలిసేది ప్రేమకున్న విలువ
నరకాన్నైనా తలపించేది విరహపు ముల్లే కదా

పోరగాళ్ళ పోకిరి కాస్త పరిధిలో ఉంటేనే అందం
కనిపించే కుర్రదాని కొంగులాగితే చెంప చెల్లే కదా

జ్ణానోదయం కలగక పోతే మనిషికేదీ సార్థక్యం
జాతి భవితను మార్చేది బడిలోని నల్ల బల్లే కదా

No comments:

Post a Comment