Saturday, July 7, 2012

ఆరాటాలు- పోరాటాలు

 
ఎవరికీ ఎవరూ ఏమీ కారు
ఎవరు ఎప్పుడు అడుగు పెడతారో
ఎలా దూరం అవుతారో
ఎందుకు విడిపోతారో
అర్థం కూడా చేసుకోవలసిన అవసరం ఉండదు
అహం పెరిగిందనో
అవసరం తీరిందనో
అసూయ తలకెక్కిందనో
మనకే మనమే తీర్పులిచ్చేసుకుంటాం
మన మనుగడ మనకే
ప్రశ్నార్ధకమవుతుంటే
మన ఆలోచనలు మనకే
అంతుచిక్కకుండా ఉంటే
ఇతరుల ఆలోచనలకు
జీవిత గమనాలకు
భాష్యాలు  ఎలా చెప్పగలం?
కళ్ళకున్న పొరలు ఒక్కటి ఒక్కటిగా
విడగొట్టుకోగలిగితే
ఎదుటివారి నిస్సహాయతను
అర్థం చేసుకోగలిగితే
తమ ఉనికిని కొనసాగించడానికి
అంతర్గతంగా వాళ్ళు చేస్తున్న సంఘర్షణను
చూచాయగానైనా శోధించగలిగితే
అడ్డుగోడలు అదృశ్యమైపోతాయి
అక్కున చేర్చుకోలేకపోయినా పరవాలేదు
అపనిందనల అభిషేకాలు చేయాలనే
ఆలోచన కనుమరుగయితే చాలు
ఇక్కడ డార్విన్ చెప్పిన మనుగడకోసం పోరాటాలు కాదు
ఆధిపత్యం కోసం అభిజాత్యాలకోసం ఆరాటం కొనసాగుతుంది
ఈ పిల్లిమొగ్గల్ని, విధూషక వేషాల్ని
అర్థం చేసుకోగలిగితే
ఇక మనస్పర్థలుండవు.
అక్కున చేర్చుకోవాలనే ఆశ పుడుతుంది
  స్వాంతన చేకూర్చాలనే ఆలోచన రేగుతుంది.
మన మనసుల్లో మసిబారిన ద్వేషం తుడుచుకుపోతుంది
ప్రేమాభిమానాలు పెల్లుబుకి ,వెల్లువలై ముంచెత్తుతాయి.

No comments:

Post a Comment