Wednesday, September 12, 2012

నకిలీ సౌధాలు


చూడు నాన్నా ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళవే
ఆప్యాయతలు, అభిమానాలు, అనురాగాలంటూ
లేనిపోని, పనికి రాని, సోది కబుర్లు వద్దు.
ఎవరిని ఎలా వాడుకోవాలో
ఎవరితో ఏ పని ఎలా చేయించుకోవాలి
నిచ్చెనలో మెట్లలా ఎలా తొక్కి వెళ్ళాలో
అందరికన్నా పైకి, అందనంత పైకి
వీలైనంతమందిని తొక్కి
పై పైకి మరింత పైకి ఎదగాలనో
ప్రణాళికలు వేసేవారే అంతా
ప్రసంగాలకేమి, పథకాలకేమి

అన్నీ డొల్ల కబుర్లే
ఇసుకలో నైనా నడిచిన అడుగులు
నాలుగు క్షణాలైనా ఉంటాయేమో కాని
వీరి మనసుల్లో సాయం పొందిన వారి ముద్ర
క్షణం కాదు కదా కనురెప్ప పాటైనా ఉండదు
అసలు సాయం పొందామనడం కాదు
నాకు సేవ చేయడం వలన నీకే లాభం
అనే వింత వితండ వాదం వీళ్ళది

ఇక్కడ మనుగడ కోసం పోరాటాలు కావు
ఆధిక్యం కోసం, అందలాల కోసం ఆరాటాలు
యోగ్యుడైన వాడే నిలుస్తాడని డార్విన్
బుద్ధిలేకో లేక వీరి బుద్ధి గుర్తించకో చెప్పాడు
నలుగురినీ వాడుకోవడం తెలిసినవాడే
నిలుస్తాడు గెలుస్తాడని వీరి కొత్త సిద్ధాంతం

ఆకాశాన్ని ఆబగా ఆక్రమించేదామని
సముద్రాన్ని సాధ్యమైనంతగా స్వంతం చేసుకుందామని
వెఱ్రి ప్రయత్నాలను చూసి
ఓ మౌనిలా . ఓ ధ్యానిలా నవ్వుకో
ఉఫ్ మంటూ ఊదితే నిలువునా కూలే
ఓ పేకమేడలా వీరి పతనాన్ని గుర్తించుకో
విలువల పునాధిలేని ఈ నకిలీ సౌధాలు
చరిత్ర పుటల్లో ఎలా సమాధౌతాయో హేతువుతో గమనించుకో

3 comments:

  1. బాగా చెప్పారు. అంతే నంటారా!? కొత్త ఆలోచనలు రేకెత్తించారు. ధన్యవాదములు.

    ReplyDelete
  2. నలుగురినీ వాడుకోవడం తెలిసినవాడే
    నిలుస్తాడు గెలుస్తాడని వీరి కొత్త సిద్ధాంతం

    పచ్చి నిజం. plz remove word verification

    ReplyDelete
  3. mi post chaala bagundi. selfishness ekkuvaipoyina ee rojula gurinchi baga chepparu.

    kashtephale garu cheppinattu word verification remove cheyyandi. comment publish cheyyalante chaala avarodhalu adhigaminchaalsi vastondi :)))

    ReplyDelete