Saturday, August 13, 2011

మరో జన్మ కావాలేమో


అరిషడ్వర్గాల్ని జయించి
జితేంద్రుడనై జీవితగమనం సాగించాలంటే
ఓ జన్మ సరిపోతుందా
తలలు బోడులైనా
తలపులు జవనాశ్వాలై పరుగెడుతుంటే
పొద్దస్తమానం వల్లేవేసే ఏ మత గ్రంథం
పెదవులపై నిలవడమే గాని
ఆచరణకు రానీకుండా అహం ఉరకలు వేయిస్తుంటే
ఇతరులు అస్థిత్వాల్ని, వ్యక్తిత్వాలని విడిచి
నే గీచిన పరిధిలో నిలవాలనే
నే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని
ఒప్పించాలని పరితపించే మొండితనం
ముదిమి నాపై స్వారీ చేస్తున్నా
నన్ను విడవకుంటే
నిజమే
నేను నేనులా నడవటం
నే అనుకునే మనిషి గా జీవించడం
నేర్చుకోవాలంటే
మరో జన్మ కావాలేమో
నా పొరుగువాడ్ని నాలా ప్రేమించే
మానవ కనీస గుణం నాలో నిలుపకోవాలంటే
ఈ జన్మంతా చాలదేమో
జన్మరాహిత్యం, కర్మరాహిత్యం పొందాలనే
నా పరితాపం
జనన,మరణ చక్రంలో నలగాల్సిందేమో
నే పఠించే శుష్క వేదాంతం
బూడిదలో పోసిన పన్నీరేమో

1 comment:

  1. ‎"పొద్దస్తమానం పటించే ఏ మత గ్రంథం
    పెదవులపై నిలవడమే గాని
    ఆచరణకు రానీకుండా అహం ఉరకలు వేయిస్తుంటే
    ఇతరులు అస్థిత్వాల్ని, వ్యక్తిత్వాలని విడిచి
    నే గీచిన పరిధిలో నిలవాలనే
    నే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని
    ఒప్పించాలని పరితపించే మొండితనం"......... చక్కగా చెప్పారు అన్నయ్యా...

    ReplyDelete