Wednesday, December 17, 2014

మగతనానికే మూలవిరాట్టు

ప్రొద్దున్నే పెద్ద పని ఉన్నట్టు లేస్తారు 
అద్దం ముందు నిలబడి ఆవలిస్తారు
ఒక సారి మనస్పూర్తిగా అభినందించుకోవచ్చుగా 
ఆత్మీయంగా ఆ ప్రతిబింబాన్ని పలకరించుకోవచ్చుగా 
మనల్ని మనమే ప్రేమించుకోక పొతే 
మన జీవితం మనకే నచ్చక పొతే
వీడి తోనో వాడి తోనో పోల్చుకుంటూ
అయితే నెత్తిన రెండు కొమ్ములు తగిలించుకొనో
ఆత్మ న్యూన్యత పెంచుకొని నలిగిపోతో
ఎందుకొచ్చిన బ్రతుకు చెప్పు
కట్టుకున్న ఇల్లాలు నచ్చదు
కడుపున పుట్టిన సంతానం నచ్చదు
ఇరుగు వారు నచ్చరు పొరుగు వారు నచ్చరు
పని చేసే యజమాని మీదే చేతకాని సెటైర్లు
తోటి వారి లోపాలపై విమర్శల విసుర్లు
అనుక్షణం అసహనం తో రగిలిపోతూ
అనుదినం అనుమానాలతో క్రుంగిపోతూ
నీ ఆయుష్షు కి నీవే మంగళం పాడుతూ
నీ అనారోగ్యానికి నీవే స్వాగతం పలుకుతూ
కుదురుగా కూర్చొని ఒక్కసారి ఆలోచించు
లోపం ఎక్కడ తగలు పడిందో మనసారా పరికించు
నీకు నువ్వు నచ్చకపోవడమే
సకల దరిద్రాలకి మూలం
నీ బలాల మూలాలు శోదించక పోవడమే
అన్ని అనర్థాలకి అసలు కారణం
ఆత్మ ఔన్నత్వమే ఆత్మ విశ్వాసానికి నాంది
ఆత్మాభిమానమే ఆనందాలకు అసలు పునాది
నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావా
సహధర్మచారిణే సద్గుణాల సమాహారంగా కనుబడుతుంది
సంతానమే ప్రేమానందాలకు ఆలంబమై నిలుస్తుంది
నిన్ను నీవు మార్చుకొని చూడు
నీవు ఆశించే మార్పు
అణువణువునా అన్ని చోట్లా కనబడుతుంది
మానవత్వం నిలువెల్లా పరిమళించి
మగతనానికే మూలవిరాట్టు గా నిలుపుతుంది

1 comment:

  1. "నిన్ను నీవు మార్చుకొని చూడు
    నీవు ఆశించే మార్పు
    అణువణువునా అన్ని చోట్లా కనబడుతుంది" .. మగతనానికి అన్నారు కాని మీ భావనలు ప్రతి మనిషికి, స్త్రీ,పురుష భేదము లేకుండా ఇద్దరికి - మానవత్వానికి మూలవిరాట్టుగా నిలుపుతుందనిపిస్తున్నది. అభినందనలు....

    ReplyDelete