ఇదిగో
ఇప్పుడే వస్తా
ఇక్కడే ఉండండి అన్నావు.
ఎదురుచూడమన్నావు
నిలుచునే ఉన్నా
ఘడియలు గంటలయ్యాయి
గంటలు రోజులయ్యాయి
రోజూలు వారాలు కాదు నెలలయ్యాయి
నెలలు కాస్తా సంవత్సరాలు
సంవత్సరాలు కాస్తా దశాబ్దాలు
ఎలా గడిచాయంటే ఎలా చెప్పను..
ఇక నీవు రావని
రాలేనని చెప్పలేక
మొహం నాకు చూపలేక
మోహం చంపుకోలేక
నీ దారి నీవు చూసుకున్నావని
నన్ను అలా వదిలి పోయావని
తెలుసుకోడానికి
తేరుకోడానికి
చాలా సమయమే పట్టింది
నిన్ను ద్వేషించే శక్తి లేక
దూషించే ఆసక్తి లేక
మరచిపోవడం తప్పదని
కాలం ఒక్కటే దానికి మందు అని
మౌనాన్ని ఆశ్రయించాను
అంత తేలికా చెలి నిన్ను మరచిపోవడం
నీవు నాకు ఆశవు కాదు
నా జీవన శ్వాసవు
రెండు సంవత్సరాలు పరిచయం కాదు నీవు
రెండు మనస్సుల ప్రణయం
జీవితాంతం నడవాల్సిన ప్రయాణం నీవు
నన్ను కాదని వెళ్ళాక
నా దారి నేను చూసుకోడానికి
జీవన సమరంలో నిమగ్నమవడానికి
ఎన్ని నిశ్శబ్ద యుద్ధాలు చేసానో
పరిణయం ప్రణయానికి ప్రమాణం కాదని
ఈ జీవన మజిలి లొ
ఎక్కడో ఎప్పుడో కలుస్తావని..........
ఓ బాధ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు
ఒక నిరాశ నిన్ను ఒంటరిదాన్ని చేసినప్పుడు
నీ మనసు ఏకాకి లా కకావికలమైనప్పుడు
నా జ్ఞాపకం నీకు ఓదార్పు నిస్తుందని
నా మాటలు నీకు తోడై నిడై ఉంటాయని
ఏ నిశిరాత్రి కలత నిదురలో
ఉలిక్కిపడి లేచినప్పుడు
నా తలపులు నీకు నిర్భీతిని కలిగిస్తాయని
ఎన్ని సార్లు తలచానో
ఎక్కడ నీవున్నావో
ఏం చేస్తున్నావని
ఎక్కడెక్కడని వెతికానో
ఫలితమివ్వని ప్రయాసలెన్ని పడ్డానో
దుర్భిణి పెట్టి వెతికినా
గూగుల్ లొ శోధించినా
నీ పేరున్న వారెందరు దొరికారో నీవు తప్ప
నిరాశకు చోటివ్వక
నిత్యం ఏదో ఒక క్షణమ్ నిన్ను మననం చేస్తూ
ఏదో ఒక రోజున నా ముందుర నిలుస్తావని
నిండైన,నిఖార్సైన, సత్యమైన ప్రేమకు
మరణం అనేది ఉండదని
కాలం మన మనసుల్ని విడదీయలేదని
ఇరిగిపోని గంధంలాంటి మన బంధం
నిత్య వసంత గీతం లా పచ్చగా ఉంటుందని
విశ్వాసం తోనే ఉన్నా
ఊపిరిలో నూతన ఉత్తేజాన్ని నింపుకుంటూనే ఉన్నా ..........