Monday, January 2, 2012

మరణ శయ్య


శరీరం శకలాలుగా
కనబడని శిధిలాలుగా
అంతర్గతం గా
క్షీణించిపోతూ
కనబడని జ్వాలలేవో
పగలని జ్వాలాద్వీపంలా
లోలోనే మండిస్తుంటే
అహరహం నాకు నేనుగా
ఆహుతవుతూ
అంచెలంచలుగా సమీపిస్తున్న
అర్ధాయుష్షుతో అంతరింపచేస్తున్న
మనసులేని మృత్యువు
శారీరక బాధను మించిన
పరితాపంతో వేదిస్తున్న పశ్చాతాపం
ఆనాడు వినోదం పేరిట
ఆహ్లదం పేరిట
స్నేహితుల ప్రేరణతో
షబాష్ అనిపించుకోవాలని
రింగు రింగులుగా వదులుతూ
నేను పొందిన పైశాచిక
నిరుపయోగ ఆనందం
చీర్స్ అంటూ వెర్రి కేకలతో
జీవితాన్ని జయిస్తున్నామనే
అహంకారాన్ని తలకెక్కించుకొని
మత్తుతో గమ్మత్తులతో చిత్తుగా
తాగి తందనాలాడిన
నా యవ్వన గర్వం
నేడు అతిశయించి
అంతంలేని పుట్టకురుపులుగా
లోలోనే రూపాంతరం చెంది
ఎప్పుడు పోతానో ఎందాక బ్రతుకుతానో
నా శరీరాన్ని కీమోథెరపీ అనే
నిప్పులకొలిమిలో కాల్చి మసిచేస్తున్న
కలియుగదేవుళ్ళకే అర్థం కాకపోతే
చివరి దశలో తోడుంటాడని
తనివితీరా చూస్తున్న ముసలాళ్ళకు
జీవితాంతం కలిసినడవాల్సిన వాడు
కళ్ళముందే హారతి కర్పూరంలా కరిగిపోతుంటే
వెర్రిచూపులు చూస్తున్న నా వాళ్ళకేమి తెలుస్తుంది
చేసిన తప్పుల్ని ఒప్పుకున్న మాత్రాన
నెత్తికెక్కిన రోగం తిరిగిపోతుందా
కనీసం ఇది చదివిన వాళ్ళ అలవాట్లు
మానకపోతాయా? ? ?