సరస్వతీ మాత భక్తుడే
మనిషన్నాక ఆ మాత్రం కళాపోషణ ఉండాలి
లేకపోతే గొడ్డుకి మనిషికి తేడా ఏంటని నటవిరాట్టు
నిక్కచ్చిగా కాదు నిర్భీతి గానే చెప్పాడు
భూమికి జానెడుంటే నేం బారెడుంటే నేం
అసలు బుర్ర ఉంటే నేం లేకపోతే నేం
ఎవడి కళాపోషణ వాడి తుత్తికోసమో
జానెడు పొట్ట కోసమో
ఎవడి బాధలు వాడు పడతాడు
రంగుల సినిమాలు, బుల్లి తెరలు, అంతర్జాల మాయాజాలాలు వచ్చాక
నాటకాలు మొదలుకొని అన్ని కళలు వెల వెల బోతున్నాయి కదా
ఇక రచయితలంటావా కొనే పాఠకులు కాదు కదా
కనీసం చదివే పాఠకులు అంతర్ధానమై
రాయాలనే కుతూహలాన్ని చంపుకోలేక
సాధారణ పాఠకులు కాదు కదా
సాహీతీ స్రష్టలమని చెప్పుకు తిరిగే
కుహానా సాహీతీ వేత్తల నుండి కూడా
గోరంత ప్రోత్సాహం లేక
తమ సాహితీ అభిలాషను
సైకతతీరాల్లో ఇంకే సెలయేరుల్లా
ఉనికిని కోల్పోతున్నారు
యవ్వనంలోనే వైధవ్యం పొందిన విధవల్లా
తమ కాంక్షల ఉధృతిని బలవంతంగా నిలుపుకుంటున్నారు
ఎవడో తెగించో, బరి తెగించో
నాలుగు డబ్బులు గుల గుల లాడటం వలనో
తీరని దుగ్ధని తీర్చుకోవాలని పరితపించో
నాలుగు పుస్తకాలు రాసి, స్వీయార్జనతో ప్రచురిస్తే
పెద్దమనసు చేసుకొని ప్రోత్సహించడం మాని
పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తావా
అటకమీద పెట్టుకుంటారో అంగడిలో పెట్టుకుంటారో
లేదా నీ చెల్లని సరుకుని ఎక్కడ తోసుకున్నావో
అక్కడే తోసుకుంటారో నీకెందుకు
సాహితీ సేద్యం చేసే ప్రతీ రచయిత
సరస్వతీ మాత భక్తుడే
ఆమె కృపాకటాక్షాలకు పాత్రుడే.....
(రచయితలందరినీ కట్టకట్టి ఓ ఆసామీ విమర్శిస్తే ఒళ్ళు మండి)
No comments:
Post a Comment