నీక్కొంచెం తిక్కుందా? లేదా?
మనిషన్నాక ఆ మాత్రం తిక్క ఉండాలి
అది తిక్కో కాదో దానికేటి లెక్కో అని
ఏ దిక్కుమాలినోడో తేల్చాల్సిన పని లేదు
ప్రతి అడ్డమాలిన గాడిద ఆడమన్నట్టు ఆడితే
ఎదురు ప్రశ్నించకుండా
డూడూ బసవన్నలా బుర్ర ఊపితే
నిన్ను మించిన బుద్ధిమంతుడు లేడని
రాముడు మంచి బాలుడని ప్రమాణ పత్రాలు
ప్రశంసల పూల జల్లు పోటీ పడి మరీ ఇస్తారు
ఆర్ద్రతలేని, అనుభూతి లేని
కుహానా కబుర్ల మాయాజాలం కోసం
నీ ఉనికిని , నీ జీవన గమనాన్ని
నీకు నీవుగా రాసుకున్న రాజ్యాంగాన్ని
పదే పదే మార్చుకున్నావా
కుక్కలచింపిన విస్తరి లా మారుతుంది నీ వ్యక్తిత్వం
దారిన పోయిన ఏ దానయ్యో
నీ అస్తిత్వాన్ని, నీ జీవన ఔచిత్యాన్ని
లెక్కకట్టడానికి
అసలు వాడికున్న అర్హత ఏమిటో
వాడు ఉపయోగించే ప్రమాణాలేంటో
బలుపంటారో
పొగరంటారో
కొవ్వు తలకెక్కిందంటారో
నెత్తిన కొమ్ములు మొలచాయంటారో
అనని. అలిసేలా వాగని
స్పందించాల్సిన పనేమీ లేదు భాయి
ఎదుటివాడితో మనం జీవించేది
కొద్ది క్షణాలో, మహ కాకపోతే కొద్ది దినాలే
నిత్యం నీతో నిలిచేది
సదా జీవించేది నీకు నీవే
ఎవడి గురించో నీ విలువల వలువలు వదలకు
ఫలితమేమొచ్చినా తరిచేందో భరించేదో
నీకు నీవే మిత్రమా
అందుకే నీ తిక్క ఎవడి లెక్కకు అందకు పోయినా
నీ లెక్కల్లో నిలిచినంతవరకు హక్కుగా భావించు
జీవితంలో ప్రతి క్షణాన్ని రమించు......
నిజమే కొన్ని తిక్కలకు ఎవ్వరికీ లెక్కలు చెప్పవలసిన పని లేదు. మన లెక్కలు మనకుంటే చాలు.
ReplyDeleteబాగా చెప్పారండీ...చాలా స్ఫూర్తి దాయకంగా అనిపించింది చదువుతుంటే.
thank you andi for your comment and compliment
Deleteమనము చేసే పనికి మనకి లెక్క తెలిసినంత వరకు ఎవరిని లెక్క చేయనవసరం లేఅదని బాగా చెప్పారండి. ప్రక్కవాడి కోసం కాకుండా మన కోసం మనం బ్రతికితే చాలు.. చాల బాగా రాసారండి
ReplyDelete