జీవితంలో పెద్ద పెద్ద అంచనాలుంటేనే
ఎదురు దెబ్బలు, వెనక దెబ్బలు ఉంటాయి
అన్నీంటికీ సిద్ధపడి ప్రయాణించేవాడికి
ఏదీ అద్భుతంగా ఉండదు
అసలు అసహ్యంగా ఉండదు
కాకుల్లాంటి లోకుల అసలు నైజాన్ని
కాచి వడబోసి త్రాగిన వాడికి
ఎదుటివారి రెండు నాల్కుల ధోరణి
ఏరుదాటాక తెప్ప తగలేసే తత్వాలు
వీసమంతైనా బాధ కలిగించవు
అసలేమాత్రం రోత పుట్టించవు
మనుషుల లేకి తనం చూసి జాలి కలుగుతుంది
వాపును చూసి బలుపనుకొని తెగ మురిసేవారి
పిల్ల చేష్టలు చిరాకు పెట్టవు చిత్రంగా అనిపించవు
మునగచెట్టు ఎక్కి కొండముచ్చులాట
గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది కాని
అంతా పట్టు ఉన్న వరకే మనకైనా, కొమ్మ కైనా
తన నీడను తానే నమ్మనివారు ఎవరికి నీడను కల్పిస్తారు
పడగనీడన చేరిన కప్పలకి తిప్పలు తప్పవు కదా
పచ్చ కామర్లకి మందెయ్యడం మాని
లోకం పచ్చగా ఉందని ఆడిపోసుకుంటే
జాలి పడక జోల పాడగలమా
జీవితం ఆగక సాగే రలు ప్రయాణమనుకుంటే
దిగిపోయిన వారి గురించి ఎవరు విచారిస్తారు
అనుభవాల మూటలు కట్టుకొని
తమ మజిలీ వచ్చేవరకు మ్యూజింగ్ లతో
ముందుకు సాగిపోవడం తప్ప...
Nice post.
ReplyDelete