Saturday, September 29, 2012

దుఃఖమంటే....

 
అనుకున్నది కానప్పుడు
అనుకోలేనిది ఎదురయ్యేటప్పుడు
సాయం పొందినవాడు
హేయంగా ప్రవర్తించేటపుడు
తోడు గా ఉండాల్సిన వాళ్ళు

తోడేళ్ళగా మారినపుడు
నీడలా ఉండేవాళ్ళు
పీడకలలా వేధించేటపుడు
మనుషులల్లో మానవత్వం
మరీచకల్లో మంత్రజలంలా మారినపుడు
విలువల వలువలు ఊడి
నడిబజారులో దిగంబరంగా ఊరేగుతున్నపుడు
ఏం చెయ్యాలో
ఎటు అడుగెయ్యాలో
ఏ చేతిని పట్టుకోవాలో
ఏ చేతిని విదిలించుకోవాలో
తెలియక స్థబ్దుగామారి
కళ్ళలో ఉన్న నీళ్ళి ఇంకిపోయి
ఒక నిర్లిప్త భావన నిలువెల్లా విస్తరించి
అచేతనంగా మారడమే
దుఃఖమంటే
కనురెప్పలకున్న పొరలు కరిగి
జీవితం అసలు ముఖ చిత్రాన్ని
అవగాహన కల్పించి
మనుషుల్ని మనీషులుగా మార్చే
భావోద్వేగ స్థితియే దుఃఖమంటే..............
koodali.org, haaram, jalleda, telugu poetry. traiiner uday kumar 

Monday, September 24, 2012

జాలి పడాల? జోల పాడాలా?


  • జీవితంలో పెద్ద పెద్ద అంచనాలుంటేనే
    ఎదురు దెబ్బలు, వెనక దెబ్బలు ఉంటాయి
    అన్నీంటికీ సిద్ధపడి ప్రయాణించేవాడికి
    ఏదీ అద్భుతంగా ఉండదు
    అసలు అసహ్యంగా ఉండదు
    కాకుల్లాంటి లోకుల అసలు నైజాన్ని
    కాచి వడబోసి త్రాగిన వాడికి
    ఎదుటివారి రెండు నాల్కుల ధోరణి
    ఏరుదాటాక తెప్ప తగలేసే తత్వాలు
    వీసమంతైనా బాధ కలిగించవు
    అసలేమాత్రం రోత పుట్టించవు
    మనుషుల లేకి తనం చూసి జాలి కలుగుతుంది
    వాపును చూసి బలుపనుకొని తెగ మురిసేవారి
    పిల్ల చేష్టలు చిరాకు పెట్టవు చిత్రంగా అనిపించవు
    మునగచెట్టు ఎక్కి కొండముచ్చులాట
    గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది కాని
    అంతా పట్టు ఉన్న వరకే మనకైనా, కొమ్మ కైనా
    తన నీడను తానే నమ్మనివారు ఎవరికి నీడను కల్పిస్తారు
    పడగనీడన చేరిన కప్పలకి తిప్పలు తప్పవు కదా
    పచ్చ కామర్లకి మందెయ్యడం మాని
    లోకం పచ్చగా ఉందని ఆడిపోసుకుంటే
    జాలి పడక జోల పాడగలమా
    జీవితం ఆగక సాగే రలు ప్రయాణమనుకుంటే
    దిగిపోయిన వారి గురించి ఎవరు విచారిస్తారు
    అనుభవాల మూటలు కట్టుకొని
    తమ మజిలీ వచ్చేవరకు మ్యూజింగ్ లతో
    ముందుకు సాగిపోవడం తప్ప...

Wednesday, September 12, 2012

నకిలీ సౌధాలు


చూడు నాన్నా ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళవే
ఆప్యాయతలు, అభిమానాలు, అనురాగాలంటూ
లేనిపోని, పనికి రాని, సోది కబుర్లు వద్దు.
ఎవరిని ఎలా వాడుకోవాలో
ఎవరితో ఏ పని ఎలా చేయించుకోవాలి
నిచ్చెనలో మెట్లలా ఎలా తొక్కి వెళ్ళాలో
అందరికన్నా పైకి, అందనంత పైకి
వీలైనంతమందిని తొక్కి
పై పైకి మరింత పైకి ఎదగాలనో
ప్రణాళికలు వేసేవారే అంతా
ప్రసంగాలకేమి, పథకాలకేమి

అన్నీ డొల్ల కబుర్లే
ఇసుకలో నైనా నడిచిన అడుగులు
నాలుగు క్షణాలైనా ఉంటాయేమో కాని
వీరి మనసుల్లో సాయం పొందిన వారి ముద్ర
క్షణం కాదు కదా కనురెప్ప పాటైనా ఉండదు
అసలు సాయం పొందామనడం కాదు
నాకు సేవ చేయడం వలన నీకే లాభం
అనే వింత వితండ వాదం వీళ్ళది

ఇక్కడ మనుగడ కోసం పోరాటాలు కావు
ఆధిక్యం కోసం, అందలాల కోసం ఆరాటాలు
యోగ్యుడైన వాడే నిలుస్తాడని డార్విన్
బుద్ధిలేకో లేక వీరి బుద్ధి గుర్తించకో చెప్పాడు
నలుగురినీ వాడుకోవడం తెలిసినవాడే
నిలుస్తాడు గెలుస్తాడని వీరి కొత్త సిద్ధాంతం

ఆకాశాన్ని ఆబగా ఆక్రమించేదామని
సముద్రాన్ని సాధ్యమైనంతగా స్వంతం చేసుకుందామని
వెఱ్రి ప్రయత్నాలను చూసి
ఓ మౌనిలా . ఓ ధ్యానిలా నవ్వుకో
ఉఫ్ మంటూ ఊదితే నిలువునా కూలే
ఓ పేకమేడలా వీరి పతనాన్ని గుర్తించుకో
విలువల పునాధిలేని ఈ నకిలీ సౌధాలు
చరిత్ర పుటల్లో ఎలా సమాధౌతాయో హేతువుతో గమనించుకో

Friday, September 7, 2012

గమ్యమే గమనం వైపు

గమ్యం ఎదురుగా  నీకు కనబడుతుందంటే
చిన్నా  చితకా లక్ష్యంతోనే నీ జీవితాన్ని
సరిపుచ్చుకోడానికి నీవి సిద్ధపడుతున్నావన్నమాట
అలసి సొలసి పోతున్నా..
 విసుకొచ్చి జీవితం పై
 విరక్తి కలుగుతున్నా
వెనుతిరిగిపోదామనే
ఆలోచన వచ్చేలా
కళ్ళకు కాదు కదా
కనీసం కలలో కూడా
నీ గమ్యం నీకు అందనంతగా ఉండాలి
నీ ధ్యాసంతా నీ గమనం పైనే
వేయబోతున్న మలి అడుగు మీదనే
ఎదురుగా బయపెడుతూ
వెక్కిరింతలతో
స్వాగతమిస్తున్న
ఆటంకాల పైనే
అవరోధాల పైనే
వాటిని అధిరోహించేందుకు
అనుసరించాల్సిన నవీన వ్యూహాలపైనే
మన పరుగు ఎక్కడ మొదలైతేనేం
ఇప్పుడు అవసరమా?
గతాన్ని పదే పదే తలుచుకోవడం వలన
గొప్పగా అనిపించవచ్చునేమో గాని
పరుగు మందగించి
గమనం గతి తప్పవచ్చు
ఎంతదూరం వెళ్ళాలో
ఎప్పటి కల్లా చేరుకుంటావో
అంటూ  రేపటి రోజు గురించి
ఆలోచనల్లో పడినా అంతే
అంత దూరమా అంటూ డీలా పడొచ్చు
ఎందుకొచ్చిన వృథా ప్రయాసలంటూ
నీ పరుగును నీవే ఆపుకోవచ్చు
అందుకే ఇప్పటికి పుఅయోగపడని
పనికిరాని ఆలోచనలు మాని
నీ వర్తమానం పై గురి పెట్టు
గమనం సరియైనదైతే గమ్యం అదే
నీ ఒళ్ళోకొచ్చి వాలుతుంది
తనను వరించే వరుడివి నీవే నని
విజయ వరమాలతో నీ తోడుగా నిలుస్తుంది

koodali.org, haaram, jalleda, motivational poetry in telugu, trainerudaykumar