సూర్యుని తొలికిరణం చురుక్కుమని తగలకముందే
ఆశల గమ్యం వైపు ఆశయాలదారులవెంట
ఆత్మ విశ్వాసం గుండెలనిండా నింపుకొని బయలుదేరుతానా..
అడుగడుగునా కనిపించే ప్రతి ఒక్కరూ
జీవన సమరం లో నిత్యం పోరాడుతూ
క్షతగాత్రులైనా. క్షుద్బాధగ్రస్తులైనా
ఓటమికి తలవంచకుండా .
ఎవరి సహయం కోసం ఎదురుచూడకుండా
ఒరిగిపోతున్న ఊపిరిని ఎగదీసుకుంటూ
నిరాశకు నిస్పృహలకు చోటివ్వకుండా
శతసహస్ర జయకేతనాలు ఎగిరించిన యోధుల్లా
ముందుకుదూసుకుపోతుంటే
ఉత్తేజం నా నర నరానా జివ్వుమంటూ పాకుతుంది
సాటి యోధుల ప్రాభవాన్ని, సాహస వైభవాల్ని చూసి
గమ్యాన్ని చేరాలనే కాంక్ష సరికొత్త చిగురులు తొడుగుతుంది.
పిరికితనానికి, పేడితనానికి శాశ్వతంగా సెలవు పలికి
తొడకొట్టు కుంటూ, రొమ్ము విరుచుకుంటూ బరిలో ఉరకాలనిపిస్తుంది