Sunday, November 3, 2013

ప్రతీ దివ్వే ఓ ఉపాధ్యాయుడే....

చిమ్మ చీకటిని చెల్లా చెదురు చేస్తూ

వెలుగు రేఖలను, కాంతి పుంజాలను 


నలుదిక్కులా వెదజల్లుతూ


అతిశయించిన ఆనందాలకు ఆనవాలుగా


ఒక్కో తారాజువ్వ ఆకాశంలోకి దూసుకుపోతుంటే


వెలుగుపుష్పాలు పూయిస్తూ చిచ్చుబుడ్డీలు కాలుతుంటే


ప్రతి వ్యక్తి జీవించాల్సిన మార్గాన్ని


కారు చీకటి లాంటి కష్టాల్ని


ఎదుర్కోవలసిన వైన్యాన్ని

 
తన తోటివారికి మార్గడర్శకంగా 


నిలవాల్సిన తత్వాన్ని ప్రబోధిస్తున్నట్టు


జీవిత సత్యాల్ని తెలియచేస్తున్నట్టు అనిపిస్తుంది 


అమావాస్య రోజు వచ్చే దీపావళి 


ప్రతీ ఒక్కరికీ ఒక పాఠశాలే 


జీవిత గుణపాఠాలను ప్రబోధించే తత్వశాలే 


బ్రతికేది ఎన్నాళ్ళైనా 


బ్రతికి నలుగురికి ఏమి చేసామన్నది


తెలిపే ప్రతీ దివ్వే ఓ ఉపాధ్యాయుడే.... 

Thursday, September 12, 2013

జీవన సమరం



సూర్యుని తొలికిరణం చురుక్కుమని తగలకముందే

ఆశల గమ్యం వైపు ఆశయాలదారులవెంట


ఆత్మ విశ్వాసం గుండెలనిండా నింపుకొని బయలుదేరుతానా..


అడుగడుగునా కనిపించే ప్రతి ఒక్కరూ


జీవన సమరం లో నిత్యం పోరాడుతూ 


క్షతగాత్రులైనా. క్షుద్బాధగ్రస్తులైనా 


ఓటమికి తలవంచకుండా .


ఎవరి సహయం కోసం ఎదురుచూడకుండా 


ఒరిగిపోతున్న ఊపిరిని ఎగదీసుకుంటూ 


నిరాశకు నిస్పృహలకు చోటివ్వకుండా 


శతసహస్ర జయకేతనాలు ఎగిరించిన యోధుల్లా 


ముందుకుదూసుకుపోతుంటే 


ఉత్తేజం నా నర నరానా జివ్వుమంటూ పాకుతుంది


సాటి యోధుల ప్రాభవాన్ని, సాహస వైభవాల్ని చూసి


గమ్యాన్ని చేరాలనే కాంక్ష సరికొత్త చిగురులు తొడుగుతుంది. 


పిరికితనానికి, పేడితనానికి శాశ్వతంగా సెలవు పలికి 


తొడకొట్టు కుంటూ, రొమ్ము విరుచుకుంటూ బరిలో ఉరకాలనిపిస్తుంది

Friday, April 12, 2013

ప్రతి రోజూ ఉగాదే

ఒక లక్ష్యం తో నడిచే వాడికి
అను క్షణం క్రమశిక్షణ తో బ్రతికే వాడికి
ఇతరుల విజయం లో తన విజయాన్ని చూసుకునేవాడికి
నలుగురినీ ఉపయోగించు కోవాలన్న దురాశ లేకుండా
నలుగురికి కొంతైనా ఉపయోగపడాలని తపించేవాడికి
ఎవడి మీద ఏ రకమైన ఏడుపు లేనివాడికి
మనసులో ఎటువంటి అశుద్ధమైన ఆలొచనలేకుండా
అమ్మ ప్రేమలాంటి స్వచ్చదనం కలిగిఉండేవాడికి
నలుగురినీ నడిపించేవాడికి
పద పద మంటూ భవితకై పరుగులెత్తించేవాడికి
ఎవడెక్కడ ఎదిగిపోతాడో అంటూ
ఎటువంటి కుతంత్రాలు, కుమంత్రాలకు ప్రయత్నించనివాడికి
తన తప్పుల్ని ఇతరులమీద రుద్దాలని తపించనివాడికి
తన కష్టంపై తాను జీవించాలని శ్రమించేవానికి
ఎవడి జేబుకి ఎలా కన్నం వేయాలో తలంచనివాడికి
మానవత్వ పరిమళాలు వెదజల్లేవాడికి
ప్రేమ సౌరభాలు పరిమళింపచేసేవాడికి
ఎందుకు జన్మించానో.. ఎందుకు జీవిస్తున్నానో
అనే పరమార్థం కోసం పరిశోధించేవానికి
ఈ రోజే కాదు.. ప్రతి రోజూ ఉగాదే
ప్రతి క్షణమూ ఉగాదే....

Saturday, March 30, 2013

అభిసారిక

 
నా కోసం అభిసారికలా
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని
ఎదురుచూపులు చూస్తూ
తెరిచిన తలుపుల వద్ద
నా తలపులతో నిన్ను నీవే
మరచిపోయి నిలుచున్నావు
ముక్కుసూటిగా ఏ గమ్యం వైపో
సాగిపోతున్న నన్ను
గుర్తించడం మరచావో
మొహమాటం పడ్డావో
ఏమరుపాటు పడ్డావో
ఏమైతేనేం....నీవున్నది
నాకోసమని తెలియక
నిర్లక్ష్యమని భావించానో
అహం దెబ్బతిందని
పౌరుషం పడ్డానో
నిజం తెలియక తొందరపడ్డానో
రెండు దారులు వేరయిన తర్వాత
ఎవరి బరువులు వారు
మోయడం మొదలపెట్టాక
ఆ రోజు ఎందుకిలా జరిగిందని
కలిసి సాగాల్సిన ప్రయాణం
ఎందుకిలా వేరయిందని
ఎవరిని నిందిస్తే ఏమి ప్రయోజనం
నిశిరాత్రి లో ఏకాంతం గా కూర్చొని
నీ గుండె చప్పుడు ఇంకా
నా కోసం ధ్వనిస్తుందని
తెలుసుకొని ఏమి ఫలితం
విషాధం తో అంతమయ్యే ప్రేమలే
పదికాలాలు నిలుస్తాయని
మరుగున పడిన జ్ఝాపకాల పుట్టను
మరలా మరలా తవ్వుకొని
మౌనంగా రోధించడం తప్ప

Tuesday, March 12, 2013

కర్మయోగిలా

ఎందుకిలా జరిగిందని
ఎవరినీ ఎప్పుడూ ప్రశ్నించలేం
అసాంతం పరిశీలించి చేసిన
మన ఆలోచనలే
మహా తెలివితో తీసుకున్న
మన నిర్ణయాలే
కాలగమనం లో తప్పని తెలిస్తే
ఎవరినీ నిందించలేని
ఇబ్బందికర పరిస్థితిని
పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తే
సరిదిద్దుకోలేని
పొరబాటు జరిగితే
ఒంటరిగా గుండెలవిసేలా
దుఃఖం తీరినంత వరకు
మౌనంగా రోధించడమే
ఎవరిపైనో నెపం వేయాలనో
ఇంకెవరినో దుర్భాషలాడాలనో
ప్రయత్నాలు పక్కన పెట్టి
దైవ నిర్ణయమని సరిపెట్టుకోవడమో
ప్రత్నమ్నాయ పరిస్థితికి
సిద్ధం కావడమో ?
కర్మయోగిలా కాలాన్ని
నమ్ముకొని ముందుకుపోవడమో..........

Sunday, February 10, 2013

తొలి సంతకం నీవు



ఎలా  చెప్పను  చెలి
హృదయపు తెల్ల కాగితం మీద
తొలి సంతకం నీవు

కాలం విడిచిన
అనుభవాల పొరల్లో
చెదరని జ్ఝాపకం నీవు

సర్దుబాటుతో
గడిపే సంఘటనలెన్నున్నా
గుండెను కుదిపె స్పందన నీవు

ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు
కలిసినా తడి ఆరని
వెచ్చని తొలిముద్దువు నీవు

వేదనలాంటి వేసవిలో
నిరాశా నిస్పృహలతో ఉంటే
చల్లగా సేద తీర్చే చిరుజల్లువు నీవు

మోడుబారినా, మసకబారినా
నిత్యం కొత్త వెలుగు ప్రసరించే
నిత్య ఉగాదివి నీవు

కంటికి నీవు దూరమైనా
చిరునామా ఏదో చెదిరిపోయినా
తెలియని ఆశతో నడిపించే ఇంధనం నీవు

Friday, February 1, 2013

మగతనమంటే

ఆడవారిని అర్థం చేసుకోలేనివాడు
అమ్మతనం చవి చూడనివాడే
అమ్మ లాలింపు పొందని వాడు
అతివల ఔదార్యాన్ని, ఔన్నత్వాన్ని
అర్థం చేసుకోలేడు అవగాహన పొందలేడు
మగతనం అంటే కర్కశంగా కాఠిన్యంగా
కరుణలేకుండా బండలాగ బ్రతకడం కాదు
బయట పరిస్థితులబట్టి ఎలా వ్యవహరించాల్సి వచ్చినా
లోన లోలోన అమ్మతత్వం అపురూపంగా దాచుకోవడమే
పూలని నలిపినట్టు, వాసన చూసి వెదజల్లినట్టు
వ్యవహరించడం మూర్ఖత్వం అమానుషత్వం
శతశాతం శౌర్యం నీలో ఉందంటే సుమబాలల సున్నితత్వం
ఆడవారి ఆత్మగౌరవం నిలపడం నీకు తెలుసన్నమాట
తండ్రితో ఉన్నప్పుడెంత గోముగా, ధైర్యంగా మరికొంచెం పెంకిగా
తల్లితో ఉన్నప్పుడు ఎంత విశ్వాసంగా, లాలనగా మరికొంచెం అతిచనువుగా
ప్రతి స్త్రీ ఉంటుందో ఆ భావనలన్నీ నీవు కల్పించగలిగావంటే
నీ ఆదరణలో , నీ ఆప్యాయతలో వాటిని మరువగలుగుతుందో
నూటికి నూరుపాళ్ళు నీవు మగవానిగా విజయం సాధించినట్టే
చెంతన నీవున్నావంటే గజ గజా వణకడం కాదు
ఎక్కడో పారవేసుకున్న పసితనం మరలా ఆమెలో ప్రవేశించాలి
ఆనందం చిందులు వేస్తూ, కబుర్లతో కాలహరణం కావించాలి
ప్రక్కన నీవున్నావంటే ప్రపంచాన్ని జయించినంత
పులకరింత నరనరానా నిండాలి నూతనోత్సాహం కలగాలి
కొత్త బంగారు లోకం కనులముందు నిలవాలి
కలకాలం సాగాలనే కోరికలతో నడవాలి
koodali, haaram, telugu poems.